కొత్త పుస్తకాలు ఏమి తెప్పించుకోవాలా అని ఒక చిట్టా తయారు చేస్తుంటే ఈ పుస్తకం కనపడింది. పుస్తకం గురించి చదువుతుంటే “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” కార్యక్రమంలో గురవారెడ్డి గారితో ఇంటర్వ్యూ చెయ్యటం జరిగింది అని తెలిసి అది చూసాను. మంచి భోళా మనిషి అనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం మాకు దగ్గరలో జరుగుతున్న సంబరాలకి బాపు గారు వస్తున్నారు అని తెలిసి బుడుగు, కోతి కొమ్మచ్చి పుస్తకాలు తీసుకుని బయలుదేరాము. అక్కడికి వెళ్ళి సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్న సభలోకి వెళ్ళి చూద్దును కదా ఇసక వేస్తే రాలనంత జనం. సుద్దాల అశోక్ తేజ గారు పద్యాలు పాడుతుంటే జనం చప్పట్లు కొడుతున్నారు. సరే కష్టం మీద కూర్చోవటానికి రెండు కుర్చీలు సంపాదించి బాపూ గారి కోసం ఎంత వెతికినా వారు కనపడరే. ఇలా లాభం లేదని బాడ్జీలు పెట్టుకుని హడావిడిగా తిరుగుతున్న వాళ్ళని కనీసం ఒక నలుగురుని అడిగాను బాపు గారు ఎక్కడ వున్నారు అని. తెలియదు అని సమాధనం. బాపు గారు తెలియదా, ఎక్కడ వున్నారో తెలియదా అని అడిగే ధైర్యం నాకు లేక పొయింది. ఇంతలోకి ఒక పెద్దావిడ మైక్ తీసుకుని ఒక ప్రముఖ సినీ నటుదు అక్కడికి వస్తున్నాడని అందుకే ఈ జనం అని చెప్పి తెలుగు భాష మీద అభిమానం వుంటే పక్క గదిలోకి రమ్మని విగ్నప్తి చేసారు. ఇక లాభం లేదు అని ఆవిడనే పట్టుకుని అడిగాను బాపు గారు వచ్చారా అని. ఆవిడ రాలేదు అని చెప్పారు. రేపు వస్తారా అని అడిగాను. రాకపోవచ్చు అని, మీరు ఎవరు అని అడిగారు. నేను ఆటోగ్రాఫ్ అని అన్నానో లేదో ఆవిడ మొహం తిప్పేసుకుని ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
ఈ సందడిలో చూద్దును కదా గురవారెడ్డి గారు చక్కగా పంచె కట్టుకుని చేతిలో పుస్తకాలతో ఎదురు వస్తున్నారు. నేను ఆయన దగ్గరకి వెళ్ళే లోపల ఎవరో ఆయన చేతిలో పుస్తకం తీసుకోవటం, ఆయన అది ఉచితం కాదు అమ్మితే వచ్చిన సొమ్ము దానం చేస్తున్నట్టు చెప్పటం జరిగింది. నేను ఒక ప్రతి కొని వారిని సంతకం చెయ్యమని అడిగితే నా పేరు అడిగి మరీ సంతకం చేసి ఇచ్చారు.
ఈ పుస్తకం అప్పుడే రెండవ ముద్రణ పొందటం ఆశ్చర్యం కలిగించింది. కొంత అమెరికా పర్యటన కబుర్లు, కొంత పాత జ్ఞాపకాలు, నాలుగు మంచి మాటలు కలిపితే ఈ పుస్తకం. ఈ కబుర్లు అన్నీ సరదాగ సాగటం ఈ పుస్తకం ప్రత్యేకత. బోలెడన్ని చిత్రాలతో, కార్టూన్లతో అందంగా, ముచ్చటగా అచ్చు వేసారు ఈ పుస్తకాన్ని. అందుకైనా కొని దాచుకోవచ్చు ఈ పుస్తకాన్ని.
మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ.
ఈ పుస్తకంలో కార్టూన్లు వేసిన రాజు గారి గురించి ఎవరికన్నా తెలుసా? వారి బొమ్మలు వున్న పుస్తకాలు ఇంకేమన్నా మీకు తెలిసి వుంటే దయ చేసి క్రింద ఒక వ్యాఖ్య రాయండి.
ఇప్పుడో చిన్న పిడకల వేట. సాహిత్య చర్చ కోసం ఆ పక్క గదిలోకి ఎంత మంది వచ్చారో కనుక్కోండి చూద్దాం :0









నాట్స్ సంబరాల గురించే గా మీరు చెప్పేది. నాకూ అదేఅనుభవం. గురవారెడ్డి గారి సంతకంతో గురవాయణం. వరప్రసాద్ రెడ్డి గార్ని కూడా పెట్టమంటే ఎందుంకంటూనేపెట్టారు దానికిందే.గురవారెడ్డి గారు చక్కగా ఆయన పెన్నుతోనే మన పేర్రాసి, డేటు వేసి సంతకం చెయ్యటం బావుంది.
ఏ సాహిత్య సభ గురించి మాట్లాడుతున్నరో కానీ ( నాలుగైదు జరిగాయ్..ఆ రెండు రోజుల్లో) నేనూ వెళ్ళిన రెండూ ..బాల్ రూం నిండి పోయింది.
నాకు నచ్చిన హైలైట్ ..బాపు గారి సందేశం.తనెందుకు రాలేనో చెప్తూ..”అనారోగ్య కారణాల వల్ల..అంటే తెలుగులో health reasons”
వ్యాఖ్య ద్వారా Pavani — జులై 4, 2011 @ 7:40 పూర్వాహ్నం |
సంతోషం పావని గారు. ఓపికగా వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.
వ్యాఖ్య ద్వారా leo — జులై 4, 2011 @ 1:03 అపరాహ్నం |