చిక్కవీర రాజేంద్ర
మూలం : శ్రీనివాస (మాస్తి వెంకటేశ అయ్యంగార్)
అనువాదము : అయాచితుల హనుమచ్ఛాస్త్రి
ప్రధమ ముద్రణ : 1973
ద్వితీయ ముద్రణ : 1990
నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
ప్రాస్తావికం
భరతవర్షానికి ఉన్న అనేక సౌభాగ్యాల్లో ఒక ముఖ్యమైంది ఏమిటంటే ఓ దేశానికుండవలసిన శోభాగరిమలతోబాటు, ఓ మహాఖండానికుండవలసినవిస్తారమూ, వైవిధ్యమూ కలిగియుండడమనేది. ‘గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ, నర్మదే సింధుకావేరి జలేస్మిన్ సన్నిధిం కురు’ అని మన పెద్దవాళ్లు దేశంలోని ఏడు పుణ్యనదుల్ని ప్రతిదినం, ఓసారైనా స్మరిస్తూ వుంటారు. కాని అట్లా స్మరించేవాళ్లల్లో గంగను చూచినవాడు కావేరిని చూడడం, కావేరిని దర్శించినవాడు, గంగాదర్శనం చేయడం, వేయింట ఒకసారి కూడా వుండదు. ఇంత విశాలమైన ఈ భూమి మతం, నీతి, సంస్కృతి – వీటి ఆధారంగా ఎంతోకాలం నుంచీ, ఒక్కటిగా వుంటూవచ్చినా, ప్రభుత్వపద్ధతిని రాజకీయంగా ఒకే భూఖండంగా ఏర్పడడం, నిజానికి ఇటీవలిమాటే. భిన్నభిన్నప్రాంతాలు భిన్నభిన్న జీవితవిధానాలతో పెరుగుతూవచ్చాయి. అనేక సమయాల్లో వివిధప్రాంతాలలోనూ, ఒక్కొక్కప్పుడు ఒకేప్రాంతంలోని భిన్నభూభాగల్లో, వేరువేరు రాజవంశాలు వర్ధిల్లి ఒక్కొక్కప్రాంత చరిత్రకూ, ఒకొక్కదేశచరిత్ర అంతటి మహత్తును సంపాదించిపెట్టాయి. ఆ ఒక్కొక్కచరిత్ర ఒకొక్కదేశచరిత్ర అంత విపులమై, విశాలమై, మహిమాన్వితమై ఒప్పింది. దీనికి ఉజ్జ్వలమైన ఉదాహరణం రాజస్థానం. రాజపుత్రుల ఆ భూమి, భరతభూమిలో ఓ చిన్నభూభాగం. కానైతే అందులో ఇరవై చిన్నభూభాగాలున్నాయి. ఆ ఒక్కొక్కభాగంయొక్క చరిత్రా, ఒక్కొక్క రాష్ట్ర చరిత్ర అంత విస్తారమై, కీర్తిమంతమై కానవస్తుంది. ఆ శౌర్యం, ఆ ధర్మనిష్ఠ, ఆ క్షాత్ర తేజస్సు, ఆ శ్రద్ధ, ఆ నేలపై ఎంత సొంపుగా వర్థిల్లాయి! మరోవైపు ఆ ధార్ష్ట్యం, ఆ అవివేకం, ఆ స్వార్థం, ఆ లోభం, అవెంతగా పెచ్చుపెరిగి పోయినాయి! ‘బహురత్నా వసుంధరా’ అనేది నిజమైనమాట. భారతదేశ సందర్భంలో కూడా ఇదెంతో యథార్థం మూటగట్టుకొన్న మాట. ఏ ప్రాంతం చూసినా, అందులో ఏ భాగం పరికించినా, వాటివాటి చరిత్ర కీర్తిమంతంగా, గమనార్హంగా, మార్గదర్శకంగా వెలసింది.
పై మూడుగుణాలతో పెంపారి పెద్దదనిపించుకోదగ్గ చరిత్ర కలిగివున్న ఓ చిన్న భూభాగం కొడుగు. బొంబాయి నుంచి ప్రారంభమైన సహ్యపర్వతపంక్తి, దక్షిణాభిముఖంగా సాగి దారి పొడుగునా, పశ్చిమసముద్రాన్ని చూస్తూ చాల ఎత్తైన శిఖరాలతో ఒప్పారింది. నీలగిరి పంక్తుల నుండి ఇంకా ముందుకుపోయేముందు కొడుగుభూమిలో వాయవ్యదిశలోని వుప్పగిరి నుండి తావళగేరి, మరునాటి బ్రహ్మగిరి వరకూ ఐదుయోజనాల మేరకు శిఖపంక్తులు వరుసగా నిలబడి వున్నాయి. ఇంతపొడుగునా పర్వతాలు అడ్డంగా రెండుయోజనాలు, మూడుయోజనాల దూరం, భూమిలో కానవస్తూ ఈ ప్రదేశంలో, ఓచోట పల్లంగా, ఓచోట మెట్టగా ఏర్పడి గుట్టల గుంపుగా చేసేసింది. వీటిల్లో ప్రసిద్ధికెక్కిన కొండకొమ్మలనేకంగా వున్నాయి. పుష్పగిరిలో రెండు శిఖరాలు; మడకేరి దగ్గిర కొటబెట్ట, అన్నింటుకంటె ఎత్తైన తడియండ తప్పనబెట్ట కడియత్తునాడులోని సోమనమలె. ఇవన్నీ ఈ ప్రాంతంలోని ఉన్నతశిఖర పంక్తులు. ఏదో పోటీపడి ఒకదాన్ని మీరి ఒకటి వుండాలన్నట్లు , ఒకదాన్ని మరోటిచూస్తూ పైపైకి పోతూన్నట్లు కానవస్తాయి.
కొడుగు కావేరికి పుట్టిల్లు. నది బ్రహ్మగిరిలో పుట్టి, ఆగ్నేయంగా సిద్ధాపురం వరకూ అక్కడి నుంచి ఈశాన్యంగా సిరియంగళ వరకూ, కొడుగుభూమిపై ప్రవహిస్తుంది. మధ్యలో తడియండమోళి నుండి పరుగెత్తుకొనివచ్చే కక్కబె, సోమనమలె నుంచి ప్రవహించివచ్చే కరడ హిగ్గళ నుంచివచ్చే కదనూరుకాల్వ బెప్పనాడులోని మగ్గుల నుంచి వచ్చే కుమ్మెకాల్వ, ఎడనాల్గునాడులోని కగ్గోడు నాడులోని ముత్తారముడి హోరూరు నూరొక్కిలి నుండి చికలి కక్కచోరు వాగులూ, మాదాపురం వాగులూ, చేరి పెంపొందిన హోరంగి కుశాలనగరానికి ఉత్తరంగానూ ఈవిధంగా పదిమూలల నుంచీ పద్దెనిమిది సన్న చిన్న కాల్వలన్నీ కలిసి దీనిలో సంగమించి దీన్ని పోషిస్తున్నాయి. హేమవతీనది ఈనాటిజలంతో పెరిగి ప్రవహిస్తూ దేశానికి ఉత్తరసీమగా వుంది. దేశంలోని కొండలమీదపుట్టి లక్ష్మణతీర్థ ఈశాన్యంగా అడవుల్లో, కొండల్లో ప్రవహిస్తూ దేశానికి ఎల్లగావుంటూ కావేరికి ఉపనదులై అందులో కలిసిపోతున్నాయి.
అయిదుయోజనాలు నిడివి, మూడుయోజనాలు వెడల్పు ఉన్న ఈ కొండసీమ ఓ విలక్షణమైన మనుషసముదాయానికి నివాసభూమిగా వుంది. వీళ్లే కొడుగులు. ఈ ప్రజలు ఒక సముదాయంగా పెరిగి, ఓ విధమైన జీవితసరణిలో నడుచుకోవడంచేత, వాళ్ల నివాసభూమి ఓ విలక్షణమైన ప్రత్యేకదేశమే అనిపించుకొంటుంది. దేశంలో ప్రత్యేకస్థానం ఉన్నప్రటికీ కొడగులు, ఈ దేశాన్ని ఎన్నడూ పాలించినజాడ కనబడదు. కొడగులుకాని అనేక రాజకుటుంబాలు, ఇక్కడ పాలిస్తూ వచ్చాయి. కదంబులు, గాంగులు, చోళులు, చాళుక్యులూ, హొయ్సలులు, ఈ నేల ఏలిన రాజవంశాలు. చివరలో ఇక్కేరి రాజవంశంలోని ఒక యోధుడు ఇక్కడికి వచ్చి వెనకటి రాజవంశాన్ని నిర్మూలించి జనులకోరికపై తానే రాజయ్యాడు. ఆయన వంశం రెండువందల ఏండ్లకు పైబడి ఏల్బడి సాగించింది.
ఓ వైపు మైసూరు, ఇంకోవైపు మలయాళం, మరోవైపు మంగళూరు ప్రభుత్వాలుంటూ వుంటే, వాటిమధ్య నిలబడ్డ కొడగు రాజులు తమ స్వాతంత్ర్యం కాపాడుకోవడానికే యుద్ధాలు చేయాల్సివచ్చేది. పర్వతప్రాంతం కావడంచేత బైటివాళ్లు ఆ దేశాన్ని గెలవడం ఏమంత సులభం కాదు. దొడ్డ వీరరాజేంద్రులు అనే వంశంలోని రాజు చాల చాకచక్యంతో రాజ్యం పాలించి తన సమకాలిక రాజబృందంలో గౌరవప్రతిష్ఠలు సంపాదించాడు.
దొడ్డ వీరరాజుకు తన కూతురు దేవమ్మాజి రాజ్యం పాలించాలని కోరిక. దేవమ్మాజి సింహాసనం ఎక్కింది. కాని ఆయన తమ్ముడు లింగరాజు అది పనికిరాదని హఠంపట్టి, మొదట తాను దివానుగా వుండి ఆపైన దేవమ్మాజిని గద్దెనుంచి దింపి తానే రాజ్యానికి వచ్చాడు. తొమ్మిదేళ్లు రాజ్యం చేసి దివంగతుడయ్యాడు. అప్పుడు ఆయన కుమారుడు ఇరవై ఏళ్ళ ప్రాయమువాడు, చిక్కవీరరాజు ప్రభువయ్యాడు.
కొడగు నేలిన ఈ రాజకుటుంబంలో ఈయన చివరి రాజు. ఇతని పరిపాలనలో పధ్నాలుగోయేట కొడగు ఆంగ్లేయుల కైవసమైంది. చిక్క వీరరాజు తన వంశానికి కీర్తి తెచ్చిన దొర కాడు. ఆయన చివరి సంవత్సరం ఏల్బడి మన కథావస్తువు.
ముగింపు చూచాయగా తెలుపుతూ మొదలైన ఈ రచన చివరికంటా ఆసక్తికరంగా సాగింది. రచయితకు ఈ రచన ద్వారా 1983 సంవత్సరంలో భారతీయ జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈ పుస్తకం కోసం చాలా నాళ్ళుగా ప్రయత్నిస్తున్నా లభించలేదు. నవోదయ రామమోహనరావు గారు వారి స్వంత కాపీ నాకు యిచ్చారు. యింత మంచి పుస్తకం చదివే అవకాశం యిచ్చిన వోదయ రామమోహనరావు గారికి ధన్యవాదాలు.