ప్రళయ కావేరి కథలు


పులికాట్ సరస్సుగా నేడు పిలవబడుతున్న ప్రళయ కావేరి చుట్టూ అల్లిన కధలు ఇవి. ఆ ప్రాంత ప్రజలని, వారి జీవన విధానాలని, సంస్క్రతిని మన కళ్ళ ముందు నిలబెడతారు రచయిత స. వెం. రమేష్ గారు. ఈ కథలను ఇక్కడ చదవండి.

నల్లబావ తెంపు

ఆ పొద్దు నేను కోడికూతతో గూడా నిదరలేసి, అవ్వ పనులు చేస్తావుంటే, అడ్డాలు దుడ్డాలు పడతా వుండాను. కళ్ళాపి చల్లను అవ్వ నీళ్ళు తెచ్చిపెట్టుకుంటే, నే పేడ తెచ్చిపెట్టినా, ముగ్గెయ్యను అవ్వ ముక్కొట్టి తెచ్చుకుంటే, నేను యెర్రమట్టి పిడతను తెచ్చిచ్చినా, కర్రావుకు పాలు తీయను అవ్వ చెంబెత్తుకొస్తే, నేను నేను దూడను యిప్పినా, అవ్వ పరంటిల్లు ఆవుపేడతో అలకతుంటే, నేను యిల్లంతా ఆవు పంచితం చల్లినా, అవ్వ పందిట్లోని కోళ్ళ గంపల్ని యెత్తతుంటే, నేను కోళ్ళకి తైదులు చల్లినా, అవ్వ పొంతకుండలో నీళ్ళు పోస్తుంటే నేను అల్లి సుదుగులు తెచ్చి పొయ్యి దగ్గిర పేర్చినా, అవ్వ దాలిలో బూడిద యెత్తితే, దాన్ని నేను దిబ్బలో పోసొచ్చినా, అవ్వ పిడకలు కొడతా వుంటే, నేను పేడను పొట్టులో పొల్లిచ్చి యిచ్చినా, అవ్వ మజ్జిగ చిలకతా వుంటే, బొట్లోని వెన్న దుత్తను యెత్తుకొని అవ్వ పక్కన పెట్టినా.

‘ఏంది బంగారా కత? నీతో యేదన్నా పని చెప్పి చెయ్యించుకోవాలంటే, యేడుపొద్దులు బతిమాలాల్నే, యీ పొద్దు చెప్పుకుండానే చెయ్యందిస్తుండావే!’ అనిందవ్వ.

‘అవ్వా! లోలాకులగోడు ’ఇరకం‘ పోతుండాడు వా, నేనింత వరకూ ’ఇరకం‘చూణ్ణే లేదు. మన ప్రళయ కావేట్లో ఇరకమంత బాగుండే దీవి యింకొకటి లేదని తాట చెప్తుంటాడు గదా. నేను గూడా పొయ్యొస్తాను వా’ అన్నాను.

‘దీనికనాఅబయా, నిదరలేసినపిట్నించీ తోకమ్మిడ నారాయణా అని నా గొంగు బట్టుకోని తిరగతుండావు. ఇరకానికి పోవాలంటే చిన్న పననుకున్నావా? ఏ తట్టునించి పోవాలన్నా పడవలోనే పోవాల. ప్రళయకావేరి లోతు జాస్తి ఆడ, తాటిమాను నిలబెట్నా మునిగిపోతాదంట. అయినా నాకు దేనికి, మీ తాత రేపు మాపిటేళకి వొస్తాడు గదా. అడిగేసి పో’ అనిందవ్వ.

తాత యెద్దల బేరానికని దూరం పొయ్యుండాడు. రేపు మాపిటేళగ్గానీ రాడు. లోలాకులగోడు, ప్రయాణం రేపు తెల్లార్తో అని చెప్పుండాడు. అవ్వేమో పంపిచ్చనని కరుగ్గా చెప్తా వుండాది. యిప్పుడెట్ట? నేను ఆలోచిస్తుండంగానే. లోలాకు వోళ్ళ చిన్నాయినీ తొడకోని మా యింటికొచ్చినాడు.

‘ఏం నల్లయ్యా! రేపు ఇరకానికి పోతుండారంటనే? అడిగిందవ్వ.

’అవును పెదమ్మా. మా ఆడోళ్ళు పుట్టినిల్లు ఆ వూరేగదా, చానా దినాలనించీ వోళ్ళుమ్మని చూడాలని కలవరిస్తావుండాది. దానికే రేపు ప్రయాణం పెట్టుకున్నాము. అబ్బయ్యని గూడా మాతో తొడకపోతాం పెదమ్మా‘ అడిగినాడు నల్లబావ.

’వోడు దేనికిలే నల్లయ్యా! వోళ్ళ తాతగూడా లేడు. అపటా అయినొచ్చి దేనికి పంపిచ్చినావంటే నేను బొదులు చెప్పలేను‘ అనిందవ్వ.

’ఏంది పెదమ్మా! నువ్వు చెప్తే పెదనాయిన కాదంటాడా? అయినా, తిరిగొచ్చినాక పెదనాయినకి నేను చెప్పుకుంటాలే. నా సావాసగోడు రానిదే నేనూ రానని లోలాకు మకురేసుకుని కూసున్నాడు. నాలుగోనాడు మాపిటేళకి జల్లలదొరువులో వుంటాము, పంపీ పెదమ్మా‘ అన్నాడు నల్లన్న.

అవ్వ కొంచెం మెత్తబడినట్టుండాది. ’ఏ దోవన పోతుండారు నల్లయ్యా! బీములోరి పాళెం మిందనే గదా?‘ అనడిగింది.

’లేదు పెదమ్మా, ఓడపాళెపోళ్ళది పడవ పోతుండాదంట. ఉప్పుకాలవలో పడవ మింద బోతుండాము‘ చెప్పినాడు నల్లబావ.

’నీకేమన్నా తలతిక్కా నల్లయ్యా? తెల్లారి అటకాని తిప్పకు పొయ్యి బస్సెక్కితే, సద్దికూటేళకి పేటకు పోవచ్చు. ఆడ బస్సుమారి బీములోరిపాళెం పొయ్యి పడవెక్కితే, పొద్దు నన్నెత్తికి రాకముందే ఇరకంలో వుండొచ్చు. అట్టాంటిది ఓడపాళెం దగ్గిర పడవెక్కి, యాపంజేరు, పులింజేర్లు దాటి, తిరిగి ప్రళయకావేట్లోకి మల్లి… యాకాజామన బయిదేలితే, పొద్దుబొయినాక గానీ చేరుకోలేరు. దేనికి వుడకాట్లు పడతారు, శుద్దంగా పేట దోవన పోండి‘ చెప్పిందవ్వ.

‘పెద్దమ్మా! శ్రీహరికోటని రాకిట్టోళ్ళు తీసుకోని బాటేసినాక, అటకాని తిప్పకు పొయ్యి బస్సెక్కేది వాడికయిందిగానీ, మన ప్రళయ కావేటి పల్లెలోళ్ళు నూటి కొకరన్నా పేట మొకం యెరిగుందురా? పట్నం బోవాలన్నా రొండు దినాలకు సద్దిమూట గట్టుకుని, సవక్కట్టి పడవల్లో పోతుణ్ణోళం గదా! ప్రళయకావేట్లో పుట్టి పెరిగిన నువ్వు, పడవ ప్రయాణానికి యెరస్తుండావంటే చిత్రం గుండాది’ అన్నాడు నల్లబావ.

‘సరేనయ్యా! మీ యిష్టం. బద్దరంగా పొయిరండి. నిండెన్నిల కాలం, సముద్రా పోటు మింద వుండి, యాపంజేరు పులింజేర్లు అలగొడతా వుంటాయి. దాటేటపుడు చూసుకోని దాటండి’ చెప్పిందవ్వ.

‘అట్నేలే పెదమ్మా’ అని, నా తట్టు చూసి, ‘అబయా! సుక్కపొడస్తానే బయిదేలాల’ అనేసి యెల్నాడు నల్లబావ.

సందకాడ కోళ్ళు ముడుక్కునే యాళకే కూడు తిని మంచమెక్కేసినాను. మినుకు మినుకు మనే సుక్కల్ని చూస్తావుంటే కునుకు పట్టేసింది. నేను పొణుకునేటపిటికి అవ్వ సుట్టింటిని సక్కబెడతానే వుండాది.

తెల్లారి అవ్వ తట్టి లేపితే వులిక్కిపడి లేచినా, సుక్కపొడిసేసి వుండాది. చివాల్న లేచి పొయి మొహం కడగతా వుండా.

‘నిదానమబయా! మీ సుబ్బతాత బండిగడతుండాడులే. ఉప్పుకాలువ దగ్గిర వొదిలి పెట్టొస్తాడు’ చెప్పిందవ్వ.

మొహం కడుక్కోని, తపిలుడు అంబలి తాగేటాపిటికి సుబ్బతాత బండి గట్నాడు. నేను బండెక్కినా, లోలాకు, నల్లబావ గూడా యీడకే వొచ్చి బండెక్కినారు. అవ్వ నాలుగు మూటలు సద్ది కట్టుకొచ్చింది.

‘దేనికి పెదమ్మా! వసంత పులుసన్నం మూట గట్టుండాది గదా!’ అన్నాడు నల్లబావ.

‘ఇది కూడుగాదులేరా. ఇయ్యి తంపటేసిన గెణుసుగెడ్డలు. ఇయ్యి యేంచిన చెనక్కాయిలు. ఇయ్యి సద్దనిప్పట్లు. ఇయ్యి వుడకేసిన బెండలం గెడ్డలు. బెండలం గెడ్డల మూటలోనే బెల్లం పెట్టుండా. తినాలనుకున్నప్పుడు యిప్పుకోని తినండి’ చెప్పిందవ్వ.

రాత్రంతా అవ్వ నిరదబొయినట్టు లేదు. ఈ పన్లల్లో వుణ్ణెట్టుణింది. అవ్వతో పొయ్యొస్తామని చెప్పి బండి కదిలిచ్చినాము. నల్లబావోళ్ళ యింటి దగ్గిర వసంతక్క వంజివాక కోటన్న బండెక్కినారు.

‘నువ్వు గూడా ఇరకానికొస్తుండావా కోటన్నా’ అనడిగితే.

‘లేదబయా! శెనిగోరి పాళెం దాకా వొస్తా’ అన్నాడు కోటన్న.

దోవలో బోడోడి దిబ్బ దాటినాక వొచ్చే పీతిరి దొరువు దగ్గిర వొంటికి రొంటికి పన్లు ముగిచ్చుకుని, యెలుగుపడే యాళకు వుప్పుకాలువ దగ్గిరికి పొయినాము.

పడవ బయిదేలబోతుండాది. సుబ్బతాత మమ్మల్ని పడవెక్కిచ్చి, బండి యెనక్కి తిప్పి నాడు. పడవలో మేము కాక యింకా పన్నిండు మంది వుండారు. వోళ్ళలో నాకు పంబలి వీరతాత వొకడే తెలుసు. వీరతాత, మా తాతకి సావాసగోడు. అప్పుడప్పుడూ జల్లల దొరువుకు వొస్తుంటాడు.

‘ఎంక బావ మనవడు గదా నల్లయ్యా! చాలా దూరం బయదేలినట్టు వుండారే!’ పలకరించినాడు వీర తాత.

‘అవును మావాఁ, ఇరకం దాకా పొయిరావాల’ చెప్పినాడు నల్లబావ.

‘నువ్వెందాకా తాతా?’ వసంతక్క అడిగింది. ‘రాయదొరువు దాకా వస్తానమ్మే’ బొదులిచ్చినాడు తాత.

‘ఈ పడవ యాడ్నించి వొస్తుండాది తాతా?’ నేనడిగినాను.

‘సుక్కబొడస్తానే పంబలి దగ్గిర బయిదేలిందిరా, యెలుతురొచ్చే యాళకి యీడుండాది. బలబల తెల్లారేటపిటికి చిన్నతోటకి పొయ్యి, సద్దికూటేళకి రాయదొరువులో వుంటాది. సద్దులు తినేవోళ్ళు తిన్నాక, బయిదేలి గొడ్లిప్పేయాళకి యాపంజేరు దాటతా దబయా. ఆడ్నించి వొక్కరవ్వ నిదానం పొయ్యేది. ఆడాడా కాలవ మేటేసుండాది. మద్దినేళ కూటేళకి శెనిగోరి పాళేనికి పోతాది. ఆడ కూడు తిని బయిదేలితే, గొడ్లు యిళ్ళకొచ్చే యాళకి పులింజేరు దాటి, ప్రళయ కావేట్లోకి మల్లి, గప్పర గప్పర చీకట్లో ఇరకానికి పోతా దబయా’ వివరించినాడు వీరతాత.

పడవలో అందురూ వొకర్నొకరు పలకరిచ్చుకుంటా, ఎచ్చరిచ్చుకుండా వుండారు. పడావ నిదానంగా పోతా వుండాది. చలిగాలి సొక్కాయిలోకి దూరి సక్కలగిలి పెడతా వుండాది.

‘దినమ్మూ యీ కాలవలో పడవలు పోతుంటాయా తాతా?’ వీర తాతను అడిగినాను.

‘అబయా! ఈ కాలవ మందల దేనికడగతావులే. ఇది తెల్లోళ్ళు తొవ్విచ్చిన కాలవ. వోళ్ళు వుణ్ణెన్ని దినాలూ యీ కాలవ వొక్క యెలుగు యెలిగింది. ఉత్తరాదిన చీరాల నించీ, దచ్చినాన పట్నం వరకూ, సవక కట్టిలేమి, వుప్పు మూటలేమి, చింతపొండేమి, మిరపకాయిలేమి, తైదులేమి, వొడ్లేమి, గొర్రిలేమి, మేకలేమి వొకటా అబయా, సకలమూ యీ కాలవ మిందనే పోతుణ్ణింది. దినానికి యెన్ని పడవలు పోనో తెక్కల్యా. బీదాబిక్కీ దగ్గిరూళ్ళకు పొయ్యే సన్నాచిన్నా పడవలు, పట్నం బొయ్యే పెద్ద పడవలు, ఆసాములు బొయ్యే గూడు పడవలు, దొరలు బొయ్యే అంతస్తు పడవలు.. పడవల రామందాడి. ఆ వైబోగం చెప్పను వొక్కనోరూ, చూడను రొండ కళ్ళూ చాలవు’ చెప్పినాడు వీరతాత.

‘ఇప్పుడు ఆ మాదిర దేనికని పొయ్యేది లేదు తాతా?’ అడిగినాను.

‘మనకు సొతంత్రం మొచ్చినాక గూడా పదేళ్ళు బాగనే నడిసినాయబయా. అనేక గెట్టినేలన తారుబాటలు యేసేసినారు. లారీలూ బస్సులూ యెచ్చయి పొయ్యినాయి. పడవలో యీడ్నించి పట్నం బొయ్యేది రొండు దినాలు బట్టేది. బస్సులో అయితే వొక పూటలో యెల్లొచ్చు. కట్టేకంపా తోలను లారీలొచ్చె. కాలవగూడా పులింజేరుకి ఆ తట్టు చానా దగ్గిర్ల మేటులేసె. దానిని పూడికెత్తిన మగానుబావులు లేరు. అపిటికీ మొన్న మొన్న శ్రీహరి కోటని రాకిట్టోళ్ళు తీసుకోని, పేట్నించి తారుబాట యేసే వరకూ, దినానికి రొండో మూడో పామంజేరు, సామంజేర్ల నడాన నడస్తా వుండేయి. ఆ బాటేసినాక మన దీవల్లో వోళ్ళకి అటకాని తిప్పకి బొయ్యి బస్సెక్కేది లగువయిపొయింది. ఇప్పుడు నెలకి రొండు తూర్లు గూడా పొయ్యేది లేదు. రానురానూ అదీ నిలిసి పోబోతాది’ నిట్టూరస్తా చెప్పినాడు వీర తాత.

పడవ ముందుకీ, పొద్దుపైకీ సాగతుండాయి. పడవకి తూరుపుతట్టు దీవులు, పరంటతట్టు ప్రళయకావేరి. ఆ యేడు యిందాపి, కుందాపి నెలల్లోనే గెట్టి వానలు పడి ప్రళయ కావేరమ్మ నిండుగా, నీలంగా వుండాది. నీలమంటే అట్టాం టిట్టాంటి నీలంగాదు, ప్రళయ కావేరమ్మను పలకరించను మిన్ను దిగొచ్చినట్టు, మిన్నువన్నె మన్నువన్నె కలిసి మినమిన మెరిసే నీలం.

వీరతాత చెప్పినట్టుగానే, చిన్నతోట దాటినాక రాయదొరువు దగ్గిర సద్దులు తిన్నాము. వేపంజేరులోకి పొయినాము. రాయదొరువునీ, శ్రీహరికోటనీ వేరు చేసేదే వేపంజేరు. రాయదొరువంతా సాళ్ళు సాళ్ళుగా సవక తోపులు, శ్రీహరికోటలో అడ్డదిడ్డంగా యెదిగిన అడివి. అదొక అందం. యిదొక అందం. నడిమద్దెలో కుసుమిడిసిన నల్లనాగు మాదిర వేపంజేరు. నింగినీలంతో ప్రళయకావేరి నిండిపోయుంటే, అడివి నీడలు వేపంజేరంతా పచ్చంగా పరుసుకోనుండాయి.

శ్రీహరికోట ప్రళయకావేట్లోనే పెద్దదీవి. ఆ వొక్క దీవిలోనే పది పన్నిండు వూళ్ళుండాయి. ఒక్కొక్క వూరునే వొరుసుకుంటా పోతుండాది పడవ. చెంగలపాళెం దాటతానే, కాలవమింద యెత్తులో వంతెన కట్టుండారు. వంతెన దాటి పది బారలు పొయినాక కీపాక వొచ్చింది. పడవలోని జనం మూడొంతుల మంది కీపాకలో దిగేసినారు.

కీపాక దాట్నాక కాలవ ఆడాడ మేటేసి వుండాది. అట్టాంటి దగ్గిర దిగి నడవాల్సి వొస్తాది. పడవోళ్ళు యిద్దురూ పడవకు తాడుగట్టి వాటం చూసి లాగి మేటు దాటిస్తుండారు. వంటోరిపాళెం దాటినాము. కలవాగు దాటినాము. శెనిగోరిపాళెం దగ్గిర కూడు తిన్నాము. మేము నలుగురమూ, పడవోళ్ళిద్దురూ తప్పిచ్చి శెనిగోరిపాళెంలో పడవంతా ఖాళీ అయిపొయింది. అనేక రమణప్ప సత్రం దగ్గిర యిద్దురు పట్టపోళ్ళు యెక్కినారు. తెలుగు, అరం కలిసి యేమో మనమెరగని మాటలు కీసర బాసరగా మాట్లాడతారు పట్టపోళ్ళు. జోనిగపాళెం దాటి, పల్లీది దాటి పైటేళకి పులింజేరు దగ్గిరికి పొయినాము.

వేపంజేరు అందానికే యెలవరపొయ్యే నాకు. పులింజేరుని చూసి నోట్లో మాట రాలా. వేపంజేరు కన్నా రొండింతల యెలుపుతో, దొన దొన అలగొడతా వుండాది పులింజేరు. ఆడ్నించి పడవ పులింజేరులోనే పరంట తట్టు తిరిగింది.

‘అబయా! ఈ పులింజేరు తమిళ్నాటికీ, మన తెలుగుదేశానికీ యెల. పులింజేరుకి ఆ తట్టు కనిపిస్తా వుండాదే. అది నక్కదొరువు దీవి. ఆడ్నించి తమిళ్నాడే’ చెప్పినాడు నల్లబావ.

‘అట్టయితే ఆ తట్టు తెలుగు మాట్లాడే వోళ్ళే వుండరా బావా?’ అడిగినాను.

‘అంతా తెనుగోళ్ళే గదబయా! నక్కదొరువంతా తూరుపురెడ్లు వుంటారు. అది దాటితే పెద మాంగోడు. చిన మాంగోడు, దోనిరేవు దీవులు, కడాన ప్రళయకావేరి దీవి. అనేక అంతా గెట్టినేల. పట్టపోళ్ళు, పల్లోళ్ళు తప్పితే మిగతా అందురూ తెనుగోళ్ళే నబయా’ చెప్పినాడు నల్లబావ.

‘ప్రళయ కావేరమ్మని పంచుకోని పట్టపోళ్ళ సందన చిచ్చుపెట్నారు పైనుండే మహానుబావులు. ఏటా యీ పులింజేరు యెల మింద పది తల కాయిలన్నా తెగతానే వుండాయి’ పడవాయిన అన్నాడు.

మాటల్లోబడి గమనించనే లేదు. ఎప్పుడొచ్చినాయో నాలుగు పడవలు. మా పడవికి నాలుగు తట్టులా నిలబడి వుండాయి. పడవల్లో కత్తులూ, సరిగోళ్ళు పట్టుకోని ముప్పయి మంది దాకా వుండారు.

‘నల్లయా! నొచ్చుకుప్పం పట్టపోళ్ళు. పెడద్రవు నాయాళ్ళు. ఎలదాటి వొచ్చుండారంటే యేదో వుబద్దర వొచ్చినట్టే, బద్రం’ అన్నాడు పడవాయన.

అంతలోనే ‘రేయ్‌! వోర్రా అదు? సొంపలు బట్ను యెల దాంటి వొంది వుండారు’ అవతల తట్టునించి అరిసినాడొకాయన. పట్టపోళ్ళ మాటలు అట్నే వుంటాయి.

‘అనా! మేము పట్టపోళ్ళంగాదు. పంబలి నించి ఇరకానికి పోతావుండాము’ పడవాయన అరిసి చెప్పినాడు.

‘ఆ రొండు పేరు కణుతూరు పట్టపు పిన్నవాండ్లు లేదా? పొయ్‌ సొప్పేవు’ దబాయిస్తా అన్నాడు యింకొకాయన. రమణప్ప సత్రం దగ్గిర యెక్కిన యిద్దర్నీ చూపిస్తా.

‘అవ్వు, మాఁవు పట్టపువాండ్లు దా. మాఁవు యెల దాంటి సోంపలు పట్లేదు. మాఁవు ఇరకం పోబొయ్యేము. ఎల దాంటేకి మాఁపు మెయికి చొ తిందిమా, పీ తిందిమా!’ మా పడవలోని పట్టపాయన లేసి అరిసినాడు.

‘అట్ట గూడా మేము యెల మాడ దాట్నామయ్యా? పులింజేర్లోనే వుండాంగదా!’ నల్లబావ అడిగినాడు.

‘పులింజేరి మాది దా, ఇరకం మాది దా. పళవేర్కాడే మాది దా. మరి యాదగ మా పెదకాంపు కిట్టిగి వొంది దురాయి కట్టుడిసి పొండి’ మాట్లాడతానే పడవల్ని యింకా అమ్మిడికి రానిచ్చినారు. పట్టపాయన మాటలకి నల్లబావకి రోషమొచ్చినట్టు వుండాది.

‘ఏందన్నో, మాటలు బద్దరంగా రానీ. మేము దురాయి కట్టాల్నా? మేమేమన్నా పట్టపోళ్ళమా? ఎల దాటి చేపల యాట కొచ్చినామా? దేనికి కట్టాల దురాయి?’ అన్నాడు నల్లబావ లేసి నిలబడి.

‘యో! నీ వోరో తెలియాదు. పట్టపువాండ్లతో గలాట వొద్దు నొచ్చుకుప్పం వొంది పో’ అవతల నించి యినబడింది.

‘అనా! నువ్వు పట్టపోడివయితే, నేను ముత్తరాసోణ్ణి. పదిమంది పట్టపోళ్ళకి ముడిడవని ముతరాసోడు వొక్కడ సాల’నే సాటవ యిన్లేదా?‘ అన్నాడు నల్లన్న సరిగోలు చేతిలో కెత్తుకుంటా. మా పడవలోని పట్టపోళ్ళు మొచ్చుకత్తుల్తో నల్లన్న పక్కన నిలబడ్డారు. పడవోళ్ళిద్దురూ తెడ్లు తిరగేసి పట్టుకోనుండారు. లోలాకు. నేనూ వసంతక్కని అతుక్కోని కూచోనుండాము.

నల్లన్న బొటువయిన మనిషి. ఎంత బలవంతుడయినా, నలుగరి తోడుతో ముప్పయి మందిని యెట్ట యెదిరిచ్చాలనుకుంటుండాడో తెలీలా. బిత్తరతో గుండె దడ దడ లాడతుండాది నాకు. వసంతక్క చెల్లాతమ్మకి మొక్కతా వుండాది.

పట్టపోళ్ళు గూడా తెగించి ముందుకు దూకలా, మా పడవని పోనీకుండా సుట్టుకోనుండారు.

పరంట సిద్దలయ్య కొండల్లోకి పొద్దు జారిపోతూ వుండాది. వెలుతురు మసక దుప్పటి కప్పుకుంటూ వుండాది.

‘నల్లయ్యా! వీళ్ళు యెలుతురు పూర్తిగా పొయ్యేవరకూ యింతే. చీకటిపడి పొయినాక పైన పడతారు. చీకట్లో తేలుమాయినన్నా పట్టచ్చుగానీ, పట్టపోణ్ణి కొట్టేది కష్టం. నొచ్చు కుప్పం బొయ్యి దురాయి కట్టేదే మేలు గుండాది’ అన్నాడు పడవాయన.

‘సోమీ!నొచ్చుకుప్పం పోతే, దురాయి కింద మీ పడవను యీళుకుంటారు. ఎల దాట్నామని నొప్పి మమ్మల్ని గెంగమ్మకు బలిస్తారు. అంత పని పన్నద్దు సోమీ’ మా పడవలోని పట్టపోళ్ళు అన్నారు.

‘అనా! యేం జంకబాకండి. సావో బతుకో అందురుమూ కలిసే. నేను చాన్నాళ్ళ నించి యీ నొచ్చుకుప్పమోళ్ళ తిమురు పన్ల గురించి యింటానే వుండాను. తిమురణిగే కాలమొచ్చి, జల్లలదొరువు నల్లయ్యతో పెట్టుకున్నారు’ అన్నాడు బావ.

చీకటి పడిపొయింది. ‘డేయ్‌! వాండ్ల పడవకు పగ్గం కట్టి యీళుకొని రా’ అవతల పడవనించి యినబడింది. నల్లన్న చెయ్యి సరిగోలు మింద బిగుసుకునింది.

అంతలో, పరంట తట్టు దూరంగా యేదో కలకలం యినబడింది. అందరమూ ఆ తట్టుకి చూసినాము. దూరంగా ప్రళయకావేట్లో దియిటీల యెలుగులో నాలుగయిదు పడవలు వస్తా వుండాయి. వొచ్చేవోళ్ళెవురో తెలీక నొచ్చుకుప్పం పడవలు గూడా గుట్టుగా నిలబడినాయి.

కొంచేపుటికి మొహాలు తెలిసేంత దగ్గిరకొచ్చినాయి పడవలు. మొత్తం అయిదు పడవలొస్తుండాయి. ముందొచ్చే పడవను చూసి నా మొహం దియిటీ కన్నా యైక్కువగా యెలిగిపొయింది. ఆ పడవ మింద వొక చేత్తో కత్తవకర్ర పట్టుకోని, యింకొక చేత్తో మీసం మెలేస్తా నిలబడుకోనుండాడు మా తాత.

‘నల్లబావా! తాతొస్తుండాడు’ సంబరంగా అరిసినాను నేను. నా అరుపుతో వొచ్చే వోళ్ళు మా వోళ్ళని నొచ్చుకుప్పమోళ్ళకి తెలిసిపొయింది. చివాల్న పడవల్ని యెనక్కి తిప్పి పులింజేర్లో మాయమయినారు.

తాతోళ్ళ పడవ దగ్గిరి కొచ్చింది. తాత యెగిరి మా పడవలోకి దూకినాడు.నేను పరిగెత్తి పొయ్యి తాతని కరుసుకున్నాను.

‘ఈడకి యెట్టొచ్చినారు పెదనాయినా?’ అడిగినాడు నల్లబావ.

‘మీరు తెల్లారి యిట్ట బయిదేలుంటారు. అట్టనేను జల్లల దొరువుకు వొచ్చినా. మీ పెదమ్మ మందల చెప్పింది. రొండు దినాల నుంచీ యెలమింద పట్టపోళ్ళయి గలాట్లుగా వుండాయని పేటలో యెవుతో చెప్పుణ్యారు. అపట్నే బయిదేలి, బీములోరిపళెం మింద మాపిటేళకి ఇరకానికొచ్చినా, మీ కోసరం చూసి చూసి, దేనికో సందేహమొచ్చి యీళ్ళని తొడకోని బయిదేలినా’ చెప్పినాడు తాత.

అప్పటి దాకా బెదురుతో బిగుసుకుపొయుండిన వసంతక్కలేచి, ‘తాతా నువ్వు రాక పొయ్యుంటే, యీ పొద్దు మా గతేమి అయుండాల’ అనింది కళ్ళనీళ్ళు పెట్టుకుంటా.

‘ఏమయుండదు. మా నల్లడొక్కడే నొచ్చుకుప్పాన్ని దొంసం చేసుంటాడు’ నవ్వతా అన్నాడు తాత.

పులింజేరు నించి ప్రళయకావేట్లోకి మల్లింది మా పడవ.

(సమాప్తం)

Advertisements

2 thoughts on “ప్రళయ కావేరి కథలు

  1. EE kadhalu chaduvuthunte malla palletullaki velli vachchinantha santhosham gaa undi. Apweekly.com lo konni kadhalu chadivaanu. Veelunte ee pustakam yekkada dorukuthundo cheptaara? konukkoni intlo unchukovalasina pustakam. Dhanyavaadalu. – Sirisha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s