ఇనుపతెర


ప్రతి తల్లి తండ్రి చదవవలసిన వ్యాసం.

 ఇనుపతెర

– దగ్గుమాటి పద్మాకర్‌

బి.పి. ఏపరేటస్‌ స్క్రూ లూజ్‌ చెయ్యగానే బుస్‌ మంటూ గాలి బయటకు వచ్చింది. చేతికి చుట్టిన పట్టీని ఊడదీస్తూ, “ఫిజికల్‌ ప్రాబ్లమ్స్‌ ఏమీలేవు నాన్నా! అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ప్రాబ్లమ్‌ నీ మైండ్‌లోనే ఉన్నట్టుంది” అన్నాడు వాసు. “మెంటల్‌ డాక్టర్‌వి కదరా! అన్నీ మెంటల్‌ ప్రాబ్లమ్స్‌లాగానే కనిపిస్తాయేమో” నవ్వుతూ అన్నాను. “ఫ్యూచర్‌ అంతా మా వాళ్లదే నాన్నా”
“ఆ … ఇప్పుడేదో మేధావులు రాజ్యమేలుతున్నారా యేంటి?”
“అందుకే గద నాన్నా ఫ్యూచర్‌ కూడా మాదేననేది” అంటూ బెల్‌ నొక్కాడు. తలుపు కొంచెం తీసి తొంగి చూసిందొక అమ్మాయి. “భవానీని పంపించు” చెప్పాడు ఆ అమ్మాయితో. “మీరిటు కూర్చోండి నాన్నా” అంటే నేవెళ్లి వాడి పక్కన లంబంగా తిరిగివున్న సీట్లో కూర్చున్నాను.

“నమస్తే”అంటూ నవ్వుతూ వచ్చిందొకావిడ. మావాడు కూర్చోమన్నాడు. వయసు ముప్పయి ఐదేళ్లు ఉండొచ్చు. ముప్పయిలాగే ఉంది. పొందికగా, నాజూగ్గా చూడగానే బాగా చదువుకొన్న అమ్మాయే ననిపిస్తుంది.
నన్ను చూపిస్తూ “మా నాన్న గారు” అన్నాడు.
రెండు చేతులూ కదిలించి “నమస్కారమండీ” అంది. హ్యాండ్‌బ్యాగ్‌ వల్ల పూర్తి నమస్కారం చేయలేకపోవడంతో దాన్ని తీసి పక్కసీట్లో పెట్టింది.
ఆమె వైపు చేయి చూపుతూ “భవానీ ఇంటర్‌లో నా క్లాస్‌మేట్‌ నాన్నా. అప్పుడు మా అందరికీ తనతో మాట్లాడాలంటేనే భయమేసేది. ఇప్పుడేమో తన కొడుకే తనను భయపెడుతున్నాడు” అన్నాడు మావాడు.
ఆమె నవ్వింది. అయిదారు క్షణాల తర్వాత –
“ఎలా ఉన్నాడు మీవాడు?” అడిగాడు మావాడు.
ఆమె నిట్టూర్చింది. “నువ్వన్నట్లు … గత నెలరోజులుగా వాడిని కొట్టడం లేదు. తిట్టడం లేదు … అయినా వాడిలో మార్పు కనిపించక విసుగొస్తుంది నాకు.”
“అవునా.”
“అవునా యేంది? ఇంకా చెప్పాలంటే వాడి అల్లరి యెక్కువయ్యింది కూడాను.”
“నువ్వు నిజంగా మారావా.”

“ప్రామిస్‌! ఒక్క దెబ్బకూడా కొట్టలేదు. ఎంత కోపం వచ్చినా పళ్లబిగువున భరిస్తున్నానంటే నమ్ము.” “కోపం వస్తుంటే యింక నువ్వెక్కడ మారినట్టు ?” ఆవిడ విచిత్రంగా చూస్తూ అంది “కోపమేరా కూడదా?”
“రాకూడదు. ఎందుకు వస్తుంది?”
“ఈ మధ్య పక్కఫ్లాట్‌ వాళ్లబ్బాయితో కలిసి ఆడుకుంటూ ట్యూబ్‌లైట్‌ పగలకొట్టాడు. కొట్టలేదే నేను.”
“సీరియస్‌గా చూశావా?”
“అవును. సీరియస్‌గా చూస్తూ ‘యేంది చిన్నా యిది’ అన్నాను. మళ్లీ మొన్న అక్వేరియం పగలగొట్టాడు. చెయ్యి పైకెత్తి కూడా తమాయించుకున్నాను. నేను మారి ప్రయోజనమేంది చెప్పు. నీలాంటి డాక్టర్లు, పుస్తకాలు పిల్లలను కొట్టకూడదు … కొట్టకూడదు అని అదే పనిగా అంటుంటారు కాని ప్రాక్టికల్‌ లైఫ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది తెలుసా?”
“నువ్వు ఇంటికెళ్లే దారిలో కట్టెల దొడ్డి ఉంటే పొడుగ్గా చక్కగా ఉన్న కర్రనొకదానిని బాగా లావుగా ఉండేట్టు చూసి కొనుక్కెళ్లు మరి” కూల్‌గా అన్నాడు మావాడు.
ఆమె తల పట్టుకుంది నవ్వుతూ.
“అమ్మా భవానీ! మీ వాడి వయస్సు పదేళ్లు. నీ వయస్సు … అమ్మో! దాని ప్రస్తావన ఎందుకులే గాని, నీ ఆలోచనా విధానం మీరిద్దరూ సమవుజ్జీలు అన్నట్టుంది. పిల్లలు తప్పులు చేస్తారు. ఎవరి పిల్లలైనా! ఒకప్పుడు మనమైనా అలాగే చేశాం. అవి చైతన్యంతో, అంటే తెలిసి జరిగేవి కాదు.”
“మూడు వేల రూపాయల అక్వేరియం. భయం ఉండద్దూ. అందుకనే గదా పగలగొట్టాడు.” “వాడు చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ కింద చతికిలపడి ఉంటాడు కదా! తప్పుగా నడిచాడని దండించలేదేమి? అంతకుముందు దోగాడాడు కదా! మోకాళ్లు దోక్కుంటాయని పడుకోబెట్టి పెంచకూడదూ మరి!”
“అప్పుడు వాడికేమీ తెలియదు గదా.”
“ఇప్పుడేనా మీవాడికి అన్నీ తెలిసింది. జ్ఞానం కూడా సాపేక్షం కదా భవానమ్మా. ఇప్పుడూ నీకు కొన్ని తెలీకనే కదా కౌన్సిలింగ్‌కి వచ్చావు.”

“మరేం చెయ్యాలి.”
“వాడి వయసెంత? వాడి జ్ఞానమెంత? వాడి వయసు లక్షణాలేంటి? అనేవి పరిశీలించాలి మరి.”
“మావాడికి జ్ఞానం బాగానే ఉంది. ఇంకా చెప్పాలంటే పొగరు కూడా బాగానే ఉంది. నేను కొట్టడం లేదని తెలిశాకే మితిమీరాడు.”
“పొరపాటు జరిగిన ప్రతి సందర్భంలోనూ నీవు యేమీ ఎరగనట్లు గాను, యేమీ జరగనట్టుగాను ఉండగలగాలి. పిల్లలున్న యింట్లో యేం జరిగినా జరగొచ్చు. ఇంకా చెప్పాలంటే అక్వేరియం కొనేప్పుడే – ఇది ఎప్పుడైనా పగిలిపోవచ్చని మానసికంగా సిద్ధపడాలి. రెండవ అంశం – పొరపాటు జరిగిన వెంటనే -నువ్వు కోపంతో కొట్టడమో, తిట్టడమో చేస్తే – నీ రియాక్షన్‌ కారణంగా వాడు ఆ పొరపాటు విశ్లేషించుకోలేడు కదా! అర్థం చేసుకుని విశ్లేషించుకుంటేనే మళ్లీ ఆ పొరపాటు చేయకుండా ఉండేది. మనం తిట్టినందువల్ల మాత్రం కాదు. పెద్దలం ఆ అవకాశం యివ్వకుండా – మన రియాక్షన్‌ గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తున్నాం.”
“డబ్బు వేస్ట్‌ అనేది పక్కన బెడదాం, వాడు అక్వేరియం పగలగొట్టేప్పుడు చాలా కేర్‌లెస్‌గా ఉన్నాడు. కావాలని చేసినట్టుగానే ఉంది. నేనొక పక్క జాగ్రత్తంటూనే ఉన్నాను. జరిపేశాడు దాన్ని.”

“పిల్లలు వయస్సు పెరుగుతున్నకొద్దీ తాము గ్రహిస్తున్న వాటిపట్ల కొన్ని ఫిక్సేషన్స్‌ ఏర్పరచుకుంటూ ఉంటారు. నిజానికి మార్పుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేది వాళ్లేగాని మనం కాదు. సో…మీ వాడికి వాళ్లమ్మంటే ఒక ఫిక్సేషన్‌ ఏర్పడి ఉంటుంది. రకరకాల సందర్భాలలో నీ ఫీలింగ్స్‌, అంటే కోపంలో, బాధలో, ఆలోచనలో, అవమానంలో …. ఇలా రకరకాల సందర్భాలలో మీ వాడికి నువ్వు బాగా పరిచయం … ఎన్నేళ్లుగా…పదేళ్లుగా … కాబట్టి నువ్వు ఒక అలవాటు ఎంత కాలంలో పోగొట్టుకోగలవనేది మీవాడి లెక్క మీ వాడికి ఉంటుంది. కాబట్టి నువ్వు నిజంగా మారావా? ప్రయత్నిస్తూ మారలేక పోతున్నావా? మారినట్లు నాటకమాడుతున్నావా? అని నీ సహనాన్ని టెస్ట్‌ చేసుకుంటున్నాడు. కాబట్టే ఇంకొంచెం ఇబ్బంది పెడుతున్నాడు.”
“మా వాడు నన్ను పరీక్షిస్తున్నాడా?”
“నేనూ అంతే చిన్నప్పుడు. మా నాన్నను కూడా పరీక్షించాను మరి. నువ్వయినా అంతే.”
“ఓర్నాయనో! పోనీలెమ్మని మారుతుంటే టెస్టింగ్‌ పేరుతో ఇంకొంచెం రైజ్‌ అవుతారా?”
“తగ్గాలంటే ఒకటుంది.”
“అదేంది?” ఉండబట్టలేక నేనే అడిగాను.

“పిల్లలమీద మనకొచ్చే కోపాన్నిబట్టి పెద్దవాళ్ల నోటినుంచి సహజంగా కొన్ని మాటలు వస్తుం టాయి. నాన్నా- మీక్కూడా” అంటూ మళ్లీ అటు తిరిగి చెప్పసాగాడు. “అంటే కోపాన్ని బట్టి కొడతాను, తంతాను, తాటతీస్తాను, చంపుతా ఇలాంటి మాటలు. తంతాను అంటే తన్నాలి. కొడతాను అంటే కొట్టాలి. వాతలేస్తా అంటే వాతలెయ్యాలి. చంపుతాను అంటే చంపాలి.”
“ప్రపంచంలో యెవరూ అలా తిట్టకుండా ఉండలేరు.”
“ప్రపంచం గురించి కాదు గానీ, ఉన్న విషయం అది! చేసేదే కదా చెప్పమనేది. అది నీకు చేతకాకపోగా, నీ బలహీనతకి ప్రపంచాన్ని తెచ్చి అడ్డం పెట్టుకోవడం ఎందుకు? మీ వాడికంటే పాతికేళ్ల యెక్కువ జ్ఞానం ఉండి కూడా – మారడం ఇంత కష్టమనిపిస్తే – పిలకాయలు కదా! వాళ్లకు మనం చెప్పే కండీషన్‌లు ఎంత కష్టంగా ఉంటాయో కాస్త ఆలోచించు భవానీ.

ఒకటా రెండా? పొద్దున లేచిన దగ్గర్నుంచి తల్లీ, తండ్రీ, పది మంది టీచర్లు అందరూ ప్రతి క్షణం చేసేది కంట్రోలింగే కదా!
నిద్రలేపగానే లేవాలి – ఇష్టమున్నా లేకున్నా.
స్నానం చెయ్యమంటే చెయ్యాలి – ఇష్టమున్నా లేకున్నా.
హోం వర్క్‌ చేయాలి – విసుగేస్తున్నా.
యూనిఫాం వేసుకోవాలి – ఇష్టం లేకున్నా.
టై, బెల్టు, షూ వేసుకోవాలి – ఇష్టమున్నా లేకున్నా. పది కేజీల బ్యాగ్‌ మొయ్యాలి – చాలా కష్టంగా ఉంటుంది.
ఆడుకోవాలనిపిస్తున్నా క్లాసులోనే గడపాలి.
అర్థం కాకున్నా, రాకున్నా ఇంగ్లీషులోనే మాట్లాడాలి.
తెలిసిన జవాబులు చెప్పాలనిపిస్తే అడగరు, అడిగినవి చెబ్దామంటే రావు.
ఫలానా డ్రస్‌ వేసుకోవాలనిపిస్తే – ఇంకోటి అంటారు.
ఆడుకోవాలంటే – చదువుకొమ్మంటారు.

ఆలోచించు భవానీ – పాపం పసివాళ్లు. వాళ్ల ఇష్టప్రకారం ఏ క్షణాన్నయినా మనం గడపనిస్తున్నామా?
పెట్రోలు పట్టించిన స్కూటర్ని వీధుల్లో తిప్పుకుంటున్నట్లు రెండు ముద్దలు అన్నం పెట్టి కావల్సినట్టు కంట్రోల్‌లో పెడుతున్నామా? లేదా?
మన ఈ చర్యల వల్ల వాళ్లకీ కోపం వస్తుంది. మనకన్నా తారస్థాయిలో కూడా వస్తుంది. అయినా వాళ్లేమీ చేయలేరు. నిస్సహాయులు పాపం. ఆ ఆవేశానికి ఔట్‌లెట్‌ లేకపోతే డిప్రెస్‌ అవుతారు. దాంతో మనోవికాసం వొట్టిపోతుంది. సైకలాజికల్‌ అండ్‌ హిస్టీరిక్‌ కంప్లయింట్స్‌ స్టార్ట్‌ అవుతాయి. ఒక క్షణం ఆలోచించు. పోనీ, ఇది చెప్పు. క్రమశిక్షణతో పాటు మనం బ్యాలెన్స్‌డ్‌గా అనుబంధాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నామా! మెజారిటీ తల్లిదండ్రులకు పిల్లలతో తగినంత అనుబంధం ఉండడం లేదు. ఈ విషయంలో చాలా యిళ్లలోని పసివాళ్లకంటే వారి పెట్‌డాగ్స్‌ ఎంతో అదృష్టం చేసుకున్నాయనడం వాస్తవం.”

“వాడికి అడిగినవన్నీ కొనిస్తూనే ఉన్నాను.”
“నో నో భవానీ! ఐస్‌క్రీం, బట్టలు, బొమ్మలు, ఇలాంటివన్నీ సంతోషపరుస్తాయి కాని, మెమరీలో కెళ్లవు. నువ్వనే కాదు చాలా చాలా మంది తల్లిదండ్రులు అసలు ఎమోషనల్‌ అటాచ్‌మెంట్స్‌ని మెయిన్‌టైన్‌ చెయ్యడం లేదు. నువ్వెప్పుడైనా అమ్మ బొమ్మ గీయమంటూ నీ బొమ్మ గీయించుకుని, అదెలావున్నా సంతోషం ప్రకటించావా! ఉప్పెక్కించుకొని పక్కింటి దాకా ఎప్పుడైనా తీసుకెళ్లావా? వాడి చేత జడ వేయించుకున్నావా? పౌడర్‌ పూయించుకున్నావా? వాడు వంద అనే సంఖ్య నేర్చుకునేప్పుడు వంద ముద్దులు వాడిచేతనే లెక్కపెట్టించి పెట్టావా? ఒక మంచి పాట పాడి వినిపించావా? నీ గాన మాధుర్యం వాళ్లకు అవసరం లేదు – బిడ్డలతో అనుబంధాన్ని పెంచే చర్యలు తల్లిదండ్రులు ఎంత వయస్సు వచ్చినా కొనసాగిస్తుండాలి. కాని అలా ఎందరు చేస్తున్నారు? హ్యూమన్‌ రిలేషన్స్‌ని డబ్బుతో ముడిపెట్టి కావలసినవన్నీ డబ్బులు పారేసి కొనిస్తుంటే రేపు పెద్దవాళ్లకు అనారోగ్యం వచ్చినప్పుడో, కష్టమొచ్చినప్పుడో వాళ్లు కూడా ఢిల్లీలోనో అమెరికాలోనో ఉండి ఖరీదయిన హాస్పిటల్‌లో ఖరీదయిన డాక్టర్‌చేత ఫోన్ల ద్వారా ఖరీదయిన ట్రీట్‌మెంట్‌ యిప్పిస్తారే గాని చెంతవుండాల్సిన అవసరం గుర్తించరు. అసలు వాళ్లకి ఎటాచ్‌మెంట్‌ తెలిస్తే కదా – అప్పుడు మనం మాత్రం యేమనుకుంటాం? ‘అడ్డాలనాడు బిడ్డలుగాని, గడ్డాలనాడు బిడ్డలా’ అనుకుంటూ నిర్లిప్తంగా, వైరాగ్యంగా తప్పు వాళ్ల నెత్తిన్నే రుద్దుతాం. దీనికి మా నాన్నే చెప్పాలి – అంతేనా నాన్నా” అన్నాడు నా వేపు తిరిగి.

నేనేమీ మాట్లాడలేదు. మావాడి బాల్యంలో చాలా ఘట్టాలు కళ్లముందు కదిలాయి. నేను వాడ్ని స్కూటర్‌ లాగే చూశాను. మావాడికీ నాకూ మధ్య ఉన్న గ్యాప్‌ అర్థమయ్యే కొద్దీ పుత్రప్రేమ హృదయాంతరాళం లోంచి తన్నుకొచ్చింది. వాడికి వంద ముద్దుల బాకీ యిప్పటికైనా చెల్లించాలనిపించింది.
నేను క్షణమైనా ఆగదలుచుకోలేదు. ఆమె వేపు తిరిగి ‘ఒక్క క్షణమమ్మా భవానీ’ అని లేచి నిలబడి మావాడి తలను చేతుల్లోకి తీసుకుని బుగ్గమీద ఒక ముద్దు పెట్టి కూర్చున్నాను.
నేను నా కూతురికి రెండువందల నలభై ముద్దులు పెట్టాను నాన్నా – ఒకటిచ్చి సరిపెడుతున్నావు” అన్నాడు మావాడు.
“నీ కూతురుకైతే నేనింకా యెక్కువ ముద్దులే పెడతాలే” అన్నాను.
“నో ఛాన్స్‌ నాన్నా! ఇప్పుడది వొప్పుకోవద్దూ – నీ ముసలి ముద్దుల్ని”
కాస్సేపు ముగ్గురం నవ్వుకున్నాం.

“ఈ కాలంలో మీరన్న వాల్యూస్‌ని ఎవరు మెయిన్‌టేన్‌ చేస్తున్నారు?” అడిగింది భవాని.
“ఖచ్చితంగా నిజం. మనలాగే ఒక మోస్తరు డబ్బు సంపాదిస్తున్న ప్రతివారూ పిల్లలను ఈ చిత్రహింసకు గురిచేస్తూనే ఉన్నారు భవానీ.
మంచి, మానవత్వం, నిజాయితీ, న్యాయం, ధర్మం … అంటూ పెంచితే తాము అవినీతితో, మోసాలతో సంపాదించి కూడబెట్టి యిస్తున్న ఆస్తిని రెట్టింపు చేయలేరని మనిషితో మనిషికి ఉండాల్సిన అనుబంధాన్ని, మానవీయతను తెంచేసి పిల్లలను పెంచుతున్నారు. అది చివరికి తల్లిదండ్రులతో సైతం తెంచేస్తుందన్నది యెవరూ గ్రహించడం లేదు. ఈ కారణంగా పసిమనసులకు స్వభావ సిద్ధమైన జాలి, దయ, సహృదయత వంటి గుణాలు పోయి స్వభావం మొద్దుబారి పోతుంది. ఒకలా ఉండాలనిపిస్తుంది. కాని ఇంకొకలా ఉండాల్సి వస్తుంది. మధ్యలో ఒక ఇనుప తెర. వయస్సు గడిచే కొద్దీ దాని మందం పెరిగిపోతుంటుంది. ఇంతకు ముందు వచ్చినప్పుడన్నావు. పాకెట్‌ మనీగా యిచ్చిన పది రూపాయలు మీవాడు ఎవరో ముసలావిడకు యిచ్చేశాడని – నేనడిగాను. ఏమన్నావని – ఒకటో రెండోరూపాయలు ఇవ్వవచ్చు గదా – అన్నానని చెప్పావు. సాటి మనుషుల పట్ల దయ చూపించడానికి కూడా కేలికులేషన్‌ ఉండాలా – నేను నిన్ను అవమానించడం లేదు గాని,
ఒక అర్ధరాత్రి భార్య పక్కన నిద్రపోతున్న ఒక రిక్షా వాడిని లేపి – ఎవరో స్త్రీకి నొప్పులని ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పండి – బేరం గురించి మాట్లాడకుండా అతను తప్పకుండా లేచి వస్తాడు – ఎందుకు – తన వల్ల చేతనైన సహాయం చేసే స్వభావం వల్ల మాత్రమే. ఈ సేవాభావం లేని ఇనుప తెరల సమూహాలే నేడు మనని ప్రభావితం చేస్తున్నాయి. కానీ, సాటి మనిషిపట్ల సేవాభావం కలిగి ఉండడం ఎంత హాయినిస్తుందో, మానసిక రుగ్మతలకి అదెంత మంచి మందో ఎవరికీ తెలియడం లేదు.”
“నువ్వు చెప్పినదంతా విన్నాక ఒక పిల్లవాడ్ని పెంచడం చిన్న విషయం కాదనిపిస్తుంది.” “ఏమీ కాదు. పిల్లల్ని కోళ్లు, పిల్లులు, కుందేళ్లు … అనుకుంటే చాలా సులభంగా పెంచవచ్చు. జస్ట్‌ విత్‌ కంట్రోల్‌, దట్సాల్‌ – కాని ఒక్క విషయం హ్యూమన్‌ బ్రైన్‌ – ముఖ్యంగా పిల్లల్లో చాలా క్రియేటివిటీ ఉంటుంది. నిజానికి చాలావరకు ఆ క్రియేటివిటీని చంపేసి పెంచుతున్నాం మనం. మనం మాత్రమే కాదు – తల్లి, తండ్రి, గురువు, స్కూలు, ప్రభుత్వం, దేశం, రాజ్యం, ప్రపంచం … ఒక వ్యవస్థీకృత సర్పం బాల్యం నెత్తిమీది పడగెత్తి నర్తిస్తూంది.” నిజం చెప్పాలంటే మన కుటుంబాలలో ఈ తరహా ఇనుప తెరల బాలలెవ్వరూ రేపటి సమాజానికి పనికి రారు.నిజానికి తమకు తామే పనికి రారు. రేపటి రోజున వృద్ధాప్యంలో శరీరం సహకరించని వయస్సులో, పడుకుని నెమరు వేసుకోవడానికి ఏ అనుభూతులూ మిగలని విధంగా ఇప్పటి పిల్లలు పెరుగుతున్నారు.
వీరి బాల్యం క్రమశిక్షణ పేరుతో మూసలో దాగిపోతోంది.
వీరి జ్ఞానం ఇంగ్లీషు పేరుతో గిడస బారుతోంది. నేటి బాల్యానికి యిక్కడే తల్లివేరు తెగిపోతోంది. పల్లెల్లో చీమిడి తుడుచుకుంటూనో, జారిపోయే నిక్కరు లాక్కుంటూనో పరిగెత్తుకుంటూ బడికి పోతుంటాడే – వాడు మాత్రమే రేపటి బాధ్యతగల భావిభారత పౌరుడౌతాడు.”
“అదెలా?”

“వాడు లక్ష్యాలను నిర్దేశించుకుని పెరగడు గనక! అసంతృప్తితో పాటు సంతృప్తిని కూడా టేస్ట్‌ చేస్తూంటాడు గనక. ఇంటరాక్షన్‌ ఎదుట పక్షం నుంచి లేకపోయనా వాడి పక్షంనుంచి ఉంటుంది గనక! వాడి పెంపకంలో ఎవరూ తల్లివేరుని కట్‌ చేయడం లేదు గనక! వాడికి ఇనుపతెరల కల్చర్‌ లేదు గనుక! అనంతమైన సంపదని అనుభూతుల రూపంలో స్వంతం చేసుకుంటున్నాడు గనుక.” “ఇంతకీ నన్నెలా ఉండమంటావు?” అడిగింది భవాని.
“నువ్వు గతాన్నీ,భవిష్యత్తునూ పక్కన పెట్టి వర్తమానంలో … అతి ముఖ్యమైన వర్తమానంలో జీవించు … ఈ మాట అండర్‌ లైన్‌ చేసుకోండి. వర్తమానంలో సంతోషానికి ప్రాముఖ్యతనివ్వు. మీవాడి విషయంలోనూ అలాగే చేయి. వచ్చేనెలలో మీవాడితో కలిసి రా. అప్పుడు నీ వర్తమానతత్వాన్ని, నీ అటాచ్‌మెంట్‌ని సమీక్షించుకుందాం.”
మా వాడి మాటలయ్యాక భవాని కళ్లు మూసుకొని ఉండిపోయింది. కళ్లముందు ఏయే దృశ్యాలు ఆవిష్కారమౌతున్నాయో తెలీదు.
“ఓకే! కాఫీ తీసుకుందాం. రిలాక్స్‌డ్‌గా ఉంటుంది కాస్త! ” అంటూ మూడు కప్పులు తీసి టేబుల్‌ మీద ఉంచి ఫ్లాస్కులోంచి కాఫీ వంచసాగాడు మా వాడు.
మొట్టమొదటసారిగా కాఫీ నాకు చాలా రుచిగా అనిపించింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s