జమన్


ప్రపంచ సినిమాను మీ ముంగిట్లో, అదే మీ పి.సి/మాక్ లో, వుంచుతుంది జమన్. యూట్యూబ్, జూస్ట్, బ్లాక్‌బస్టర్, నెట్‌ఫ్లిక్స్ వున్నాయిగా మళ్ళీ జమన్ ఎందుకు అంటారా, చెబుతాను. జమన్‌లో హాలివుడ్ సినిమాలు వుండవు. డాక్యుమెంటరీలు వుంటాయి, చలనచిత్రోత్సవాలకు మాత్రమే పరిమితమైన సినిమాలు ఎన్నో వుంటాయి, ప్రపంచ నలుమూలల నిర్మించిన చిత్రాలు వుంటాయి, మరీ ముఖ్యంగా మన భారతీయ సినిమాలు వుంటాయి. క్యూబన్, పెరు, ఫ్రెంచి, హాంగ్ కాంగ్ మరెన్నో దేశాల చిత్రాలు మీకు జమన్‌లో దర్శనమిస్తాయి. ఉచితమా అని అడుగుతున్నారా, చెబుతాను. ఒక వారం పాటు అద్దెకు తీసుకోవాలనుకుంటే $1.99, లేదు కొనాలనుకుంటే $4.99 చెల్లించాలి. లేదు ఒక నేస్తంను కనుక జమన్‌కు ఆహ్వానించినట్లైతే రెండు సినిమాలు ఉచితంగా అద్దెకు తీసుకోవచ్చు. ఎలా పని చేస్తుంది అని అడుగుతున్నారా, చెబుతాను. ముందుగా మీ పి.సి/మాక్ లో జమన్ ప్లేయర్‌ను ప్రతిష్టించి మీరు ఎంచుకున్న సినిమాను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత మీ ఇంటర్నెట్ వేగము బట్టి, ఆ సినిమా అందుబాటును బట్టి (పీర్ టు పీర్ కాబట్టి), ఒక రోజులోనో లేక ఒక వారం లోనో మీరు ఆ చిత్రాన్ని చూడవచ్చు. సినిమా చూసాక దానికి సమీక్ష రాయవచ్చు లేదా దాని గురించి చర్చించవచ్చు. అలాగే మీ అభిరుచికి తగిన గుంపులో చేరి మిగతా జమానిస్ట్లతో మీ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. డి.ఆర్.ఎం వాడుతున్నారు అన్న ఒక్క అభియోగం తప్పితే, చిత్రాల వైవిధ్యం లో కానీ, నాణ్యత లో కాని జమన్‌కు వంక పెట్టటానికి లేదు. జమన్ ఒక భారతీయుడు నెలకొల్పిన సంస్థ అవటం మనం అందరం గర్వించతగ్గ విషయం.

Advertisements

నాకు నచ్చిన బ్లాగులు


వీవెన్ గారి పది అత్యుత్తమ తెలుగు బ్లాగుల ఎంపికకు ఇది నా ఎంట్రీ. కొన్ని మూడవ నిబంధనను అతిక్రమించ వచ్చు అయినా ఇక్కడ లిస్ట్ చేయకుండా వుండలేకపొయాను, నాకు అంత నచ్చాయి మరి.

24ఫ్రేములు, 64కళలు

sowmyawrites ….

జగన్నాటకం

జోకులాష్టమి

తెలుగు నేల

తెలుగు మాట…తేనె ఊట

తేట గీతి

నైమిశారణ్యం

పడమటి గోదావరి రాగం.

పాతకథలపై కొత్తచూపు

మనస్విని

నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు 

రెండు రెళ్ళు ఆరు

వాగ్దేవి

విన్నవీ కన్నవీ

విహారి.

ఇప్పటి వరకు తెలియని బ్లాగుల గురించి తెలుసుకునే అవకాశం కల్పించిన వీవెన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

జీమైల్


గూగుల్ బ్లాగులో ఈ వ్యాసం చూసి ముక్కు మీద వేలు వేసుకున్నాను. నాకు ఇంకా గుర్తు మీ ఉత్తరాలను ఎప్పటికీ తొలగించనక్కర్లేదు అన్న జీమైల్ నినాదం. జీమైల్ ఫ్రీ అంటూనే అదనపు స్టోరేజ్ కి డబ్బులు కట్టమంటున్నారు యిప్పుడు. ఆప్పట్లో ప్రీమియం సర్వీసుకి డబ్బులు తీసుకునే యహూ ఇప్పుడు అపరిమితమైన స్టోరేజ్ అందచేస్తోంది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవటం అంటే యిదేనేమొ. డబ్బులు తీసుకోవటం తప్పు కాదు కానీ, గూగుల్ యాడ్స్ చూపిస్తూ, బిలియన్లు సంపాదిస్తూ కూడా, ఫ్రీ అని చెప్పి డబ్బులు అడగటం నిరాశపరిచింది. నా జీమైల్ ఖాతా వినియోగం ప్రస్తుతం 51%. 100% వినియోగించిన రోజున ఆలోచిస్తాను డబ్బులు కట్టాలో, ఉత్తరాలు తొలగించాలో.

పాలగుమ్మి సాయినాథ్


నేను మామూలుగా గూగుల్ న్యూస్, కూడలి, బ్లాగ్స్ చూసి ప్రపంచంలో ఏమి జరుగుతోందో తెలుసుకుంటూ వుంటాను. ఎప్పుడో హిందు తప్ప మరే దినపత్రిక చదవను. అయినా తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ తెలుసుకుంటున్నానులే అని ఒక ధీమా. అలాంటిది ఒక భారతీయుడుకి, అందునా ఒక తెలుగు వారికి ఈ సంవత్సరం రామన్ మెగసెసె అవార్డు వచ్చిందని యివ్వాళే చూసి, యింత మంచి సంగతి ఎలా మిస్ అయ్యానా అని కొంచెం కలత చెందాను.

పాలగుమ్మి సాయినాథ్ పత్రికా విలేఖరిగా గ్రామీణ పేదలకు ప్రాతినిధ్యం వహించి, వారి కష్టాలను మైన్ స్ట్రీం మీడీయా ద్రుష్టికి తెచ్చి దేశం స్పందించేలా చేసినందుకు ఈ సంవత్సరం రామన్ మెగసెసె అవార్డుతో సత్కరింప బడ్డారు. వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్న ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, దళితులపై అత్యాచారాలు వెలుగులోకి తేవటంలో విశేష క్రుషి చేసారు. అయిదు రాష్ట్రాలలోని పది అతి పేద జిల్లాలలో జీవన ప్రమాణాలను నివేదించటానికి చేసిన ప్రయాణంలో భాగంగా 5000 కిలో మీటర్లు కాలి నడకన పర్యటించారు! పత్రికలు ఆర్థిక సహాయము ఇంక ఇవ్వలేము అన్నప్పుడు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టారు!

తను నష్టపోతూ ఆహారాన్ని పండిస్తున్న రైతుకి తప్పక సబ్సిడీలు యివ్వాలి అంటారు సాయినాథ్ గారు. సబ్సిడీలు ఎత్తివేయటం కంటే విద్య, వైద్య, రవాణా వంటి మౌలిక సదుపాయాలు మీద ద్రుష్టి పెడితే గ్రామీణ భారతంలో ఎన్నో ఉద్యోగాలు స్రుష్టించటమే కాకుండా పురోగతి సాధించ వచ్చు అంటారు. ప్రస్తుతం వారు గ్రామీణ భారతానికి ఒక ఆర్కైవ్, ఇప్పటికి బ్రతికి వున్న స్వాతంత్ర సమర యోధుల జ్ఞాపకాలకు ఒక ఆర్కైవ్ స్రుష్టించే పనిలో వున్నారు.

సాయినాథ్ గారి గురించి మరిన్ని వివరాలకు యిక్కడ మరియు యిక్కడ చూడండి.

వారి రచనలు చాలా వరకు యిక్కడ వున్నాయి.

తీపి గురుతులు – చేదు జ్ఞాపకాలు


సంవత్సరం క్రితం అనుకుంటా చానల్స్ మార్చుతూ వుంటే దూరదర్సన్ లో గుమ్మడి గారితో సమావేశం వస్తోంది. అందులో ఆయన ఎన్.టి.ఆర్ గారితో వచ్చిన విభేదాలు, చివరి దశలో కే.వి.రెడ్డి గారికి ఇచ్చిన కారుని విజయ సంస్థ వారు వెనక్కి తీసుకోవటం వంటి ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించి అవి మరికొన్ని తన పుస్తకం ‘తీపి గురుతులు – చేదు జ్ఞాపకాలు ‘లో వ్రాసానని చెప్పారు. అప్పటి నుండి ఎంత ప్రయత్నించినా భాగ్యనగరంలో పుస్తకాల దుకాణాలలో కానీ, పుస్తక ప్రదర్సనలలో కానీ నాకు ఈ పుస్తకం దొరక లేదు. చివరికి గూగుల్ పుణ్యమా అని తెలుపు.కాం వారి ద్వారా సంపాదించాను.

సినిమా కబుర్లు మాత్రమే కాకుండా, తనకి సహాయ పడిన వ్యక్తులు, జీవితంలో తను నేర్చుకున్న పాఠాలు అన్నిటి గురుంచి ఎటువంటి భేషజాలు లేకుండా మన ముందు వుంచారు గుమ్మడి గారు. మంచి సినిమా గురించి ఆయన రాసిన వ్యాసం ప్రతి నిర్మాత, దర్శకుడు తప్పక చదవాల్సిందే. ఆ తరం సినిమా గురించి, అందులోని వ్యక్తుల గురించి తెలుసుకొవాలంటే ఈ పుస్తకం తప్పక చదవవలసిందే. నిజంగానే ఎన్నో తీపి గురుతులు వున్నాయి ఈ పుస్తకంలో.

గుమ్మడి గారి గురించి ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.