మీకు నచ్చిన పుస్తకాలు


హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతున్న సంగతి తెలుసు కదా. మీకు నచ్చినవి, మీకు తెలిసిన మంచి పుస్తకాలు వ్యాఖ్యలలో తెలియ చేస్తే కొని తెప్పించుకుంటాను. ధన్యవాదాలు.

Advertisements

ఈ మధ్య చదివిన పుస్తకాలు


సాయంకాలమైంది – గొల్లపూడి మారుతిరావు

ఈ పుస్తకం గురించి మొదట ఇక్కడ తెలిసింది. అదే రోజు మరో రెండు చోట్ల చూసాక చదువుదాం అని తెప్పించాను. చాలా రోజుల తరువాత ఒక తెలుగు నవల నచ్చింది. చాలా విషయాలు ఎంతో లోతుగా ఆలోచించి చాలా సూటిగా సరళంగా చెప్పారు గొల్లపూడి గారు. ఎక్కడా కూడా ఇది ఒప్పు ఇది తప్పు అని చెప్పినట్టు వుండదు. కొన్ని తరాలుగా తెలుగు వారి జీవితాలలో ముఖ్యంగా ఆచార వ్యవహారాలలో వచ్చిన మార్పులను మన ముందు ఉంచుతారు రచయిత. విదేశాలలో ఉంటున్న తెలుగు వారు ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ వారికి ఒక విన్నపం. దయ చేసి మలి ప్రచురణలు అన్నా మెరుగైన ముద్రణా ప్రమాణాలతో పుస్తకం ప్రచురించ వలసిందిగా మనవి. కొంచెం ధర ఎక్కువ అయినా పరవాలేదు. నా దగ్గర వున్న ప్రతి 2001 మొదటి ప్రచురణ.

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ.

కోతి కొమ్మచ్చి – ముళ్ళపూడి వెంకట రమణ (బాపూ రమణీయం) మొదటి భాగం

ఈ పుస్తకం చేతికి వచ్చాక కానీ తెలియ లేదు నాకు ఇది మొదటి భాగం అని. తెలిసి వుంటే అసలు కొనే వాడిని కాదు. రమణ గారు చెప్పే వేడి వేడి కబుర్లు, బాపూ బొమ్మలు, అల నాటి ఫోటోలు ఇదీ టూకీ గా పుస్తకం. పెద్ద పెద్ద అక్షరాలతో చూడ ముచ్చటగా పుస్తకాన్ని తీర్చి దిద్దిన హాసం ప్రచురణలు వారికి ధన్యవాదాలు.

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ.

గట్టు తెగిన చెరువు కథలు – అరి సీతారామయ్య

ఈ కథలు మింగుడు పడ లేదు. ఒక కథ చదివిన తరువాత చాలా సేపు, చాలా రోజులు ఆలోచించేలా చేసాయి ఈ కథలు. అంత తేలికగా మరిచిపోయే కథలు కావు ఇవి. ఒక కంపెనీకి పని చేస్తే ఆ కంపెనీ మనల్ని ఉంచుకున్నట్లా? కాన్పుకి తల్లిని సహాయంగా తెచ్చుకోవటం, మెక్సికో నుండి పనులు చేసే వాళ్ళను తీసుకు రావటం సమానమేనా? ఎవరి పొలం వాళ్ళు బాగు జేసుకోవాలిగాని ఎదిటి వాడి పొలం బాగుంది గదా అని అక్కడ చాకిరి జేస్తే జీతగాళ్ళం అవుతాంగాని ఆసాములమవతామా?

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ.

రాజశేఖర చరిత్ర – కందుకూరి వీరేశలింగం
(నవీకరణ: సహవాసి)

ఎప్పుడో చిన్నప్పుడు దూరదర్సన్ లో ఒక బైరాగికి బంగారం వెండి ఇస్తే అతను బూడిద మిగిల్చి ఉడాయించిన భాగం చూసిన గుర్తు. అది తెలుగులో తొలి నవల నుండి అన్న విషయం ఈ పుస్తకం చదివితే తెలిసింది. ఎందుకో మొదట్లో ఈ కథ విషాదాంతం అనిపించింది కానీ చివరికి కథ సుఖాంతం అయ్యే సరికి ఒక విధమైన ఆనందం. ‘రుక్మిణి మరణం’, ‘సీతాపహరణం’ వంటి చాప్టర్ హెడింగ్స్ (తెలుగు పదం??) కథని ముందే చెప్పేస్తూ ఇబ్బంది పెట్టినా అన్ని దారాలు కలుపుతూ (sic) కథ కంచికి చేరిన తీరు అబ్బుర పరిచింది.

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

తెలుగు పలుకు
17వ తానా మహాసభల జ్ఞాపిక

తెలుగు వారి గురించి ఒక టైం కాప్సుల్ తయారు చేస్తే అందులో తప్పకుండా ఉంచవలసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం ద్వారా పరిచయం అయిన సీతారాం మద్దాలి గారి naturearts.com లో అద్భుతమైన వాల్ పేపర్స్ వున్నాయి. ‘కొత్త కంపెనీ పెట్టు గురూ’ – ఒక ఇండియన్ స్టార్టప్ సెమీ సక్సస్ స్టోరీ వంటివి మరిన్ని చదవాలని, చూడాలని ఆశ.

హంపీ నుంచి హరప్పా దాక – శ్రీ తిరుమల రామచంద్ర

నేను సాధారణంగా ఒక పుస్తకం మొదలు పెడితే అది నచ్చినా నచ్చకపోయినా చివరి వరకు చదువుతాను. కానీ ఈ పుస్తకం మధ్యలో ఆపేసాను. నా వల్ల కాలేదు. కానీ ఇక్కడ బాగా ప్రభావితం చేసిన పుస్తకాల చిట్టా లో ఈ పుస్తకం చూసాక మళ్లీ చదవటం మొదలు పెట్టి పూర్తి చేసాను. పుస్తకం బాగా లేదు అని నేను అనను. నాకు నచ్చ లేదు అని మాత్రం అంటాను.

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ.