ఈ మధ్య చదివిన పుస్తకాలు 12/07/2011


పల్లీయులు మరో ఐదు శరత్ బాబు నవలలు
అనువాదం చక్రపాణి
ఈర్ష, ద్వేషం, అసూయ ఈ నవలలకి మూలం. మామూలుగా ఇటువంటివి నాకు నచ్చవు. కానీ రచయిత గొప్పదనమో, అనువాదకుడి నేర్పరితనమో ఆపకుండా చదివేసాను ఈ పుస్తకం. పరిణీత నవల కన్నా సినిమా అద్భుతంగా వుంది. మొదటి సారి పుస్తకం కన్నా సినిమా బాగుండటం. పల్లీయులు చదువుతుంటే అన్నా కరెనీనా గుర్తుకు వచ్చింది.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ. రచయిత గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

భట్టిప్రోలు కథలు – డాక్టర్ నక్కా విజయ రామరాజు
ఇది తెలుగులో ఎలా చెప్పాలో తెలియక ఇలా – “These stories have their heart in the right place but the soul is missing”. ప్రతి కథకి ఒక చక్కని బొమ్మ కథలకి, పుస్తకానికి వన్నె తెచ్చాయి. అసలు కథకి బొమ్మ తప్పనిసరి అని నియమం వుంటే బాగుండును.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

ఆ కుటుంబంతో ఒక రోజు – జే. యు. బి. వి. ప్రసాద్
చాలా రోజుల తరువాత ఒక మంచి పుస్తకం చదివాను. “పులిని చూసి” కథ ఇంతకు ముందే చదివి ఆస్వాదించాను. నాస్తికత్వం నాకు సరిపడక పోయినా, ఆచారం అంటూ చేసే కొన్ని పనులకి అర్థం లేదు అని చెప్పిన “మైల” కథ ఆలోచించేలా చేసింది. తప్పక కొని చదవండి.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

శ్యాంయానా – మెడికో శ్యాం కథలు
ఈ కథలు మొదట్లో చాలా కొత్తగా, ఒక కొత్త ఒరవడిలో చెప్పారే, భలే గమ్మత్తుగా వున్నాయే అనిపించింది. కానీ పోను పోను అదే విషయాన్ని తిప్పి తిప్పి చెపుతున్నట్టు అనిపించింది. ఒక సారి భేషుగ్గా చదవచ్చు.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ.

వేలుపిళ్ళై – సి.రామచంద్రరావు
పదుగురు ఆహా ఓహో అన్న ఈ కథలు బహుశా ఆ కారణంగానేనేమో అంతగా నచ్చలేదు. మరీ ఎక్కువ ఆశించినట్టున్నాను. “కంపెనీ లీజ్” మొదటి సారి చదివినప్పుడు మింగుడు పడ లేదు, ఇప్పుడు రెండో సారి కూడా. భర్తకి వేరే స్త్రీతో సంబంధం వుంది అని తెలిసీ రాజీ పడిన భార్య, ఆ స్త్రీ కష్టంలో వుందని తెలిసీ భర్త పట్టించుకోని కారణానికి భర్తని వదిలెయ్యటం ఏమిటో నాకు అర్థం కాలేదు. “ఫ్యాన్సీడ్రెస్ పార్టీ” కథ, పేర్లు గుర్తు లేవు కానీ, ఒకటి రెండు సినిమాలలో అన్నా కథ చివర వచ్చే మలుపు చూసి వుండటంతో అంత ఆసక్తిగా అనిపించలేదు. ఇక ఆఖరి కథ “క్లబ్ నైట్” నాకు ఎందుకో కొంచెం నార్సిసిస్టిక్ గా అనిపించింది; ఎందుకు వ్రాయటం లేదు అని అడిగే వాళ్ళకి సమాధానం అనిపించింది.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

అమ్మకడుపు చల్లగా – గొల్లపూడి మారుతిరావు
ఇది రచయిత ఆత్మ కథ. తెలుగులో ఇంత చక్కగా, అందంగా, శ్రద్ధగా, ముచ్చటగా తీర్చి దిద్ది అచ్చు వేసే పుస్తకాలు నాకు తెలిసి చాలా అరుదు. మీరు చదివినా చదవకపోయినా ధర పెట్టగలిగితే ఈ పుస్తకం కొని దాచుకోండి. చాలా పెద్ద పుస్తకం, చదవటానికి చాలా రోజులు పట్టింది. ఒక వైవిధ్యమయిన జీవన ప్రయాణం కదా మరి. ఎన్నో విజయాలు ఒక తీరని లోటు ఈ పుస్తకం. నన్ను నిరాశ పరిచిన ఒకే ఒక విషయం “అమరావతి కథలు” గురించి కానీ సత్యం శంకరమంచి గారి గురించి కానీ పెద్దగా వివరాలు లేక పోవటం. నచ్చిన విషయం పరనింద పెద్దగా లేకపోవటం.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

Advertisements

One thought on “ఈ మధ్య చదివిన పుస్తకాలు 12/07/2011

  1. ఈ తక్కినవన్నీ నేను చదవలేదు కానీ, వేలుపిళ్ళై కథల విషయంలో మాత్రం నాక్కూడా అతిగా ఊహించుకున్నందుకేమో…. మామూలు కథల్లా అనిపించాయి…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s