గుల్జార్ కధలు


గుల్జార్ కధలు

సాహిత్య అకాదెమీ పురస్కారం పొందిన ఉర్దూ కధానికలు

అనువాదం : సి. మృణాళిని

మొత్తం 28 కధలు వున్న ఈ పుస్తకం ఆపకుండా చదివిస్తుంది. సున్నితమైన కధలు, గుండెలు మెలిపెట్టే కధల సమాహారం ఈ పుస్తకం.  ఒక చిన్న కధలో ముంబై అల్లర్లనీ, దేశ విభజననీ మన కళ్ళ ముందు వుంచుతారు రచయిత. మనిషి ఆశల్నీ, అసహాయతను, భయాల్నీ, ఈర్షను, మనిషిలోని మృగాన్ని ఒక గొప్ప శిల్పి ఎంతో అద్భుతంగా మలచిన శిల్పంలాగా మన ముందు వుంచుతారు రచయిత. రచయిత జీవితంలో జరిగిన సంఘటనలు కూడా యిందులో ప్రస్తావించారు. చాలా కధల ముగింపు అయ్యో అనిపిస్తుంది. రెండు మూడు పెద్ద కధలు కూడా బాగున్నాయి ముఖ్యంగా ఆదిమానవుడు మొదటి సారి నిప్పుని చూసిన కధ. అలాగే రచయిత తమ తప్పిపోయిన అబ్బాయి అంటూ ఒక పంజాబీ కుటుంబ పెద్ద వారి కధ చెప్పటం అసలు మర్చిపోలేమేమో.

రచయిత ముందు మాటలో యిలా అంటారు –

“1947లో భారతదేశ విభజనను సమీపం నుంచి చూసిన వాణ్ణి నేను. నన్ను అది ఎంతో గాయపరిచింది; భయపెట్టింది. ఈ బాధను, భయాన్ని నాలోంచి తొలగించుకోవడం కోసం ఆ నేపధ్యంలో కధలు రాసాను. దీన్ని నా పాఠకులతో పంచుకోవడం ద్వారా ఆ బాధల నుంచి వీలైనంత దూరంగా పారిపోవాలనుకుంటున్నాను.

అయితే, నా ఒకే ఒక కోరిక ఏమిటంటే, ఈ కధల్ని చదివిన వాళ్ళలో మరోసారి ఆ బాధ పునరావృతం కాకూడదని. ఎందుకంటే విభజనను స్వయంగా చూసిన వాళ్లకు మరోసారి ఆ బాధను గుర్తు  చేసినట్టవుతుంది.”

ఉర్దూ నుండి తెలుగులోకి సరళంగా అనువాదం చేసి ఈ కథలను చదివే అదృష్టం కల్పించిన మృణాళిని గారికి శతకోటి వందనాలు.

Advertisements