రధచక్రాలు


రధచక్రాలు

మహీధర రామమోహనరావు

 

సొసైటీ ఫర్ సోషల్ ఛేంజ్

కావలి –  524 201

 

For copies :

Sahiti Mitrulu

#28-10-16, Maszid Street

Arundalpet, Karal Marx Road

Vijayawada – 520 002

Cell : 9490634849

 

Not for Sale

 

“1937లో నేను అనువదించిన ‘నాడు – నేడు’ చదివి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మెచ్చుకొని తమ గుర్తుదాని మీద ఉండాలన్నారు. ‘నాడు – నేడు’ అన్న పేరు తామురాస్తామన్నారు. ఈ వేళ ఆ పుస్తకం మీద కనపడే ఆ పేరు రాసింది వారే. తరువాత 1938లో అనుకుంటాను శ్రీశ్రీ చదివి ఇంత మంచి పుస్తకాల అనువదిస్తున్నావు. రచనలు ఎందుకు చేయవన్నాడు. జంకు పుడుతూంది రాయలేనని అన్నాను. కాని పదేళ్ల తరువాత రధచక్రాలు రాసేను. ఆనాడు ఏలూరులో కాంగ్రెసు వారు సభ జరిపేరు. ప్రకాశం పంతులు గారు ప్రసంగిస్తూ  కమ్యూనిస్టులు పల్లెల్లో చొరబడి, వారితో కలిసిమెలిసి తిరుగుతూ, వారి పనులు చేసి పెడుతూ, పలుకుబడి సంపాదించేరు. కాంగ్రెసు వారికిక్కడ స్ధానం లేకుండా చేశారు. మనం కూడా పల్లెలలో కెళ్లి, వారి పనులు చేసిపెడుతూంటే వారు కమ్యూనిస్టుల నుంచి మన వేపు వస్తారు – అంటూ ఉపన్యసించినట్లు పత్రికల్లో చదివేను. నవ్వుకున్నాను. కాంగ్రెసు వారు పల్లెల కేసి వెళ్లడమా? అనుకున్నాను.

 

అటు తర్వాత కొద్దికాలానికే 1948 జనవరి 19న కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రకాశం పంతులు గారు ఆర్డినెన్సు ప్రకటించేరు. అరెస్టయిన వారు అరెస్టు కాగా, తప్పించుకున్న వారు తప్పించుకోగా ఆనాడు ప్రజాశక్తి ఆఫీసులో నేను, కొసరాజు శేషయ్యగారూ మిగిలేం. పోలీసు సోదాలు జరుగుతున్నాయి. ఏమయినా పత్రిక తెచ్చామనిపించడానికి మేమిద్దరం తల ఎత్తకుండా రాస్తున్నాం. సోదాలు జరిపిస్తున్న ఎస్.ఐ. పేరు కృష్ణారావు నాయుడు. ఆయన 1940లో అరెస్టు అయినప్పుడు స్ధానిక పోలీసుల నుంచి నన్ను తీసుకుని సరాసరి రాయవేలూరు సెంట్రల్ జైలుకు పంపేశాడు. తాను విజయనగరం కాలేజీలో చదివేననీ, ఆనాడు స్టూడెంట్సు యూనియన్లో పనిచేశాననీ చెప్పేడు. ఆయనే నన్ను ముందు గుర్తు పట్టేడు. నా టేబిలు దగ్గరకు కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ప్రశ్నలు ప్రారంభించేడు. వాని సారాంశం ఒక్కటే. కాంగ్రెసుదీ, మీదీ లక్ష్యం ఒక్కటే. కాని ఈవేళ కాంగ్రెసు ప్రభుత్వం మీ మీద ఈ ఆర్డినెన్సు ఎందుకు ప్రయోగించింది?” – అన్నారు. ఈర్ష్యతో చేసిన పని చెప్పడం స్వోత్కర్ష. – వర్గ స్వభావం అన్నది అర్ధం కాదు. కనకే ఉరుకున్నా. కాని ఆయన వదలలేదు. అనేక కోణాల నుంచి అదే ప్రశ్న వేస్తున్నాడు. ఆయనకే కాదు తెలుగు ప్రజలకే అది చెప్పడం అవసరం అనిపించింది. ఆరోజు రాత్రి ఇంటికెడుతూనే నవల ప్రారంభమయింది. అందరూ భావిస్తున్నట్లు కాంగ్రెసు వాదులు, బీదసాదల యెడ వ్యతిరేకులు కాదు. దేశంలోను మధ్య తరగతుల నుంచీ, పై తరగతుల నుంచీ వచ్చిన వారిది కాంగ్రెసులో ప్రాబల్యం. ఆ తరగతుల వారి సహజమైన అలవాట్లకు అనుగుణంగానే ఉంటాయి, వారి ఆలోచనలు, చర్యలూను. దానికనుకూలమైన పధకం వేసుకోవాలి అనుకొన్నా. ఎక్కడయినా అగ్ని ప్రమాదం వస్తే అందరూ కూడుతారు. ఆ విధంగా వచ్చింది మాలపల్లి తగులబడడం. ఇళ్లు ఆర్పేరు. తోటల్లో మకాం. పాకలుంటాయి. కాపలాదారు ఉండడం, అతని పాక ఉండడం సాధారణం. బాధితుల్ని తోటల్లోకి రమ్మన్నారు. వారికి భోజనం. నాకు విఘ్నేశ్వర నవరాత్రులు భోజనాల ఏర్పాట్లు గుర్తు వచ్చేయి. అవసరానుగుణంగా పద్మనాభం, జానకి కధలోకి వచ్చేరు. ఆ రోజుల్లో చల్లపల్లి జమీందారు గాజుల్లంక భూముల్ని ఆక్రమించేడు. రైతు పోరాటం జరుపుతున్నారు. వారికి సహాయంగా కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు. దానికి చిహ్నంగా నా నవలా రంగం లంకమాలపల్లి అయింది. జమీందారు జోక్యం దివాను ద్వారా. ఆయనకు తాబేదారు ఠాణేదారు. దివాను రంగం మీదికి వచ్చేడంటే నా మిత్రులు, తుని దివాను కొడుకైన కంభంపాటి సీనియరు తెరమీదికి వచ్చేరు. నాకో విషయం ఉంది. అబద్దమాడను, నిజం చెప్పను – అని. బహుశ నవలా రచనకు అది బాగా సాయపడింది. నా 13వ ఏట 30 – 40 పుటలకు మించని రెండు సాంఘిక కధలు – వాటినే నవలలు అన్నా – రాశా. అవి చాలా కాలం నా వద్ద ఉన్నాయి. 1940లో పోలీసు దాడులలో నా లైబ్రరీతో పాటు రచనలనీ, వాని కాపీలనూ పోలీసులు అమలాపురం బజారులో గుట్టపోసి అంటించేశారని విన్నా. ఆ కధలతోనే ఆ ప్రతిజ్ఞా వచ్చి ఉంటుంది. నిజఘటనలతో కథను కూరుస్తే ఆ ప్రతిజ్ఞ నెరవేరుతుంది కదా. తరిమెల నాగిరెడ్డి తన తండ్రి సుబ్బారెడ్డి ‘రధచక్రాలు’ చదివి దానిలోని యథార్ధ కథనాన్ని మెచ్చుకున్నారన్నాడు. ఆయనకెక్కడ ఏం కనిపించిందో? జనప విత్తనాల సమస్య ఆనాడు చాలా తీవ్రంగా ఉంది. బస్తా విత్తనాలు ధర 35-40/- ఉన్న దానిని ప్రభుత్వం 125/- చేయమన్నా 250/- చేయాలని వర్తకుల పట్టుదల, దాచివేత, కమ్యూనిస్టు వాలంటీర్లు నిలవలు బయట పెడుతుండడము, బెజవాడ పాత నగరంలో ఆలపాటి వారి మిల్లులో 400 బస్తాలు దొరకడమూ మిల్లు యజమాని అరెస్టయి జబ్బు పేరుతో జనరల్ హాస్పిటలులో చేరి మరునాడే విడుదల అవడం, అల్లర్ల పేరుతో మలబారు పోలీసు దళం ఒకదానిని ప్రభుత్వం గన్నవరం తీసుకురావడం, గ్రామాలలో వారి కవాతు ప్రదర్శనలు, ఆ దళాన్ని తీసెయ్యాలని అన్ని పార్టీల వారూ ఆందోళన చెయ్యడం చారిత్రక సత్యాలు.”

 

కొన్ని సంవత్సరాలుగా ఈ పుస్తకం కోసం వెతుకుతున్నాను. నవోదయా రామమోహనరావుగారి పుణ్యమా అని దొరికింది. వారికి వందనాలు. రచయిత రధచక్రాలు కి ఉత్తర గాధగా రాసిన “ఈ దారి ఎక్కడికి?” చదివాక ఈ పుస్తకం చదవడం ఒక వింత అనుభుతి. మహీధర పుస్తకాలు తెలుగు వారి చరిత్ర పాఠాలు. వారి భవిష్యత్ దర్శనం అద్భుతం. వారి లాంటి దార్శనీకుల అవసరం నేడు ఎంతైనా ఉంది.

 

 

Advertisements