వాల్మీకి రామాయణము


img_0648-copy

వాల్మీకి రామాయణము

యథామూలానువాదము

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు

T.L.P Publishers

A Division of Excellent Enterprises

 

క్విన్ హౌస్, రోడ్ నెం. 2, హైదరాబాదు – 500034

ఫోన్: +91 040 23542515

 

నూట ఐదవ సర్గము

అగస్త్యుడు వచ్చి జయము కొరకై రామునకు ఆదిత్యహృదయస్తోత్రమును ఉపదేశించుట.

 

భగవంతుడైన అగస్త్యమహర్షి, యుద్ధము చూచుటకై దేవతలతో కలసివచ్చెను. అప్పుడు, యుద్ధముచేసి అలసి, యుద్ధమునకై వచ్చి, ఎదుట ఉన్న రావణుని చూచి యుద్ధరంగములో చింతాక్రాంతుడై ఉన్న రాముని దగ్గరకు వెళ్ళి అతడు ఇట్లు పలికెను – “నాయనా! ఓ! రామా! రామా! నిత్యమైన ఒక రహస్యస్తోత్రమును వినుము. దీనిచేత యుద్ధములో సర్వశత్రువులను జయించగలవు. పుణ్యప్రదమైన ఆదిత్యహృదయస్తోత్రమును నిత్యము జపించవలెను. ఇది సకలశత్రువులను నశింపజేయును. జయము నిచ్చును. అక్షయమైన ఫలమును ఇచ్చును. చాల పవిత్రమైనది. మంగళప్రదములైన అన్ని స్తోత్రాలలోను ఇది మంగళప్రదము. సకలపాపములను తొలగించును. చింతను, శోకమును శాంతింపజేయును. ఆయుస్సును వృద్ధిపొందించు ఉత్తమసాధనము. సూర్యుడు ప్రశస్తములైన కిరణములుగలవాడు. ఉదయపర్వతమునందు ఉదయించువాడు. లోకులను తమ తమ పనులలో ప్రవర్తింపచేయువాడు. దేవతలచేత అసురులచేత కూడ నమస్కరింపబడినవాడు. తన తేజస్సుచే ఇతర తేజస్సులను కప్పివేయువాడు. కాంతిని ఇచ్చువాడు. సర్వలోకములను నియమించువాడు. అట్టి సూర్యుణ్ణి ఆరాధింపుము. (1-6)

 

ఇతడు సర్వదేవతాస్వరూపుడు; గొప్ప తేజస్సుకలవాడు. కీరణములచేత లోకులను రక్షించువాడు. ఈ సూర్యుడు కిరణములచేత దేవగణములను, అసురగణములను, జనులను రక్షించుచున్నాడు. ఈ సూర్యుడే బ్రహ్మదేవుడు; విష్ణుడు; స్కందుడు; నవప్రజాపతులు; కుబేరుడు; కాలపురుషుడు; యముడు; సోముడు; వరుణుడు. పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు, ప్రాణవాయువు – ఇవన్నీ సూర్యుడే. ఇతడు ఋతువులను నిర్మించును. కాంతిని ఇచ్చును. అదితికుమారుడు. జగత్తు సృష్టించినవాడు. జనులను తమ తమ పనులలో ప్రేరేపించువాడు. కిరణములు గలవాడు. బంగారు రంగు గలవాడు. ప్రకాశించువాడు, బంగారు తేజస్సుగలవాడు, పగలు కల్పించువాడు. సూర్యుని అశ్వములు ఆకుపచ్చనివి. వేయి కిరణములు గలవాడు, ఏడు గుఱ్ఱములు, కిరణములు గలవాడు. చీకటిని నశింపచేయువాడు. సుఖమును ఇచ్చువాడు.ప్రాణులను సంహరించువాడు. బ్రహ్మాండమును ప్రళయానంతరము మరల సృజించువాడు. అంశువులు  (కిరణములు) గలవాడు. సూర్యుడు బ్రహ్మవిష్ణురుద్రరూపుడు, చల్లనివాడు, తపింపచేయువాడు, పగటిని కల్పించువాడు. స్తుతింపబడువాడు, అగ్ని గర్భమునందుగలవాడు, అదితి పుత్రుడు, శాంతించువాడు, శిశిరమును నశింపచేయువాడు. (7-12)

 

సూర్యుడు ఆకాశమునకు ప్రభువు. రాహువును భేదించువాడు. ఋగ్యజుఃసామ వేదముల పారమును పొందినవాడు. అధికమైన వర్షమిచ్చువాడు. ఉదకమునకు మిత్రుడు. ఆకాశమున శీఘ్రముగా సంచరించువాడు. సూర్యుడు ఎండ ఇచ్చువాడు. మండలము గలవాడు. శత్రుసంహారకుడు, ఉదయసమయమున ఎణ్ణగా నుండువాడు. అందరికీ తాపము కలుగించువాడు. పండితుడు. ప్రపంచవ్యవహారము నడుపువాడు. గొప్ప తేజస్సు గలవాడు. అందరియందు ప్రేమగలవాడు. అందరి సంసారానికీ కారణభూతుడు. సూర్యుడు, అశ్విన్యాది నక్షత్రములకు, చంద్రాది గ్రహములకు తారలకు అధిపతి. జగత్తుకు స్థాపకుడు. అగ్న్యాదితేజస్సుల మధ్య అధికతేజస్సు గలవాడు. అట్టి సూర్యునకు నమస్కారము. ఓ! ద్వాదశస్వరూపములు గలవాడా! నీకు నమస్కారము. పూర్వ(తూర్పు) పర్వతరూపునకు నమస్కారము. పశ్చిమపర్వతరూపునకు నమస్కారము. జ్యోతిర్గణముల అధిపతికి నమస్కారము. దినాధిపతికి నమస్కారము. ఉపాసకులకు విజయమును, ఉన్నతిని, క్షేమమును (మంగళమును) ఇచ్చువాడు, ఆకుపచ్చని గుఱ్ఱములు గలవాడు అయిన సూర్యునకు నమస్కారము, నమస్కారము. వేయి కిరణములు కలవాడా! నమస్కారము నమస్కారము. ఆదిత్యునకు నమస్కారము. (13-17)

 

ఉగ్రునకు నమస్కారము. వీరునకు నమస్కారము. శీఘ్రముగా వెళ్ళువానికి నమస్కారము. నమస్కారము. పద్మములను వికసింపచేయువానికి నమస్కారము. తీక్షణమైన నీకు నమస్కారము. బ్రహ్మ-విష్ణు-శివాత్మకునకు, సూర్యునకు, ఆదిత్యరూపమైన తేజస్సు కలవానికి, కాంతి గలవానికి, సర్వసంహారముచేయవానికి, రౌద్రరూపముగలవానికి నమస్కారము. చీకటిని, మంచును, శత్రువులను, కృతఘ్నులను నశింపచేయువానికి, అపరిచ్ఛిన్నమైన స్వరూపము కలవానికి, ప్రకాశించుచున్నవానికి, జ్యోతిస్సుల అధిపతికి నమస్కారము. కాల్చిన బంగారమువంటి కాంతి కలవానికి, హరికి, విశ్వస్రష్టకు, తమోవినాశకునకు, ప్రకాశస్వరూపునకు, లోకసాక్షికి నమస్కారము. (18-21)

 

ప్రభువైన ఇతడే జగత్తును ప్రళయకాలమునందు నశింపజేయును, దానినే సృష్టించును. ఇతడు కిరణములచేత శుష్కింపచేయును; తపింపచేయును; వర్షించును. అన్ని ప్రాణులూ నిద్రించుచుండగా ఇతడు వాటిలో అంతరాత్మ రూపమున ఉండి మేల్కొని ఉండును. ఇతడే అగ్నిహోత్రము, అగ్నిహోత్రము చేయువారికి ఫలమునిచ్చువాడు. దేవతలు, క్రతువులు, క్రతువుల ఫలమూ కూడా సూర్యుడే. లోకములో ఉన్న సమస్తకృత్యముల (యజ్ఞయాగాదుల) విషయమున మిక్కిలి సమర్థుడు ఇతడే. రామా! ఆపదలలోను, దుర్గమప్రదేశములలోను, భయసమయములలోను ఈ  ఆదిత్యుణ్ణి కీర్తించు ఏమానవుడూ నశించడు. జగత్తుకు ప్రభువైన ఈ దేవదేవుణ్ణి ఏకాగ్రచిత్తముతో పూజించుము. ఈ ఆదిత్యహృదయమును మూడు పర్యాయములు జపించినచో యుద్ధములలో జయము పొందగలవు. ఓ! మహాబాహూ! నీవు ఈ క్షణమునందే రావణుణ్ణి చంపగలవు.” అగస్త్యుడీ విధముగా పలికి వచ్చిన విధముగానే వెళ్ళిపోయెను. (22-27)

 

గొప్ప తేజస్సు గల రాముడు అప్పుడు అది విని శోకమును విడిచిపెట్టెను. చాలా సంతోషించి, నిశ్చలమైన మనస్సుతో ఆ మంత్రమును ధరించెను. పరాక్రమవంతుడైన రాముడు మూడు పర్యాయములు ఆచనముచేసి పవిత్రుడై సూర్యుణ్ణి చూచి, ఆదిత్యహృదయమును జపించి, గొప్ప సంతోషమును పొందెను. దనస్సు గ్రహించి రావణుని చూచి సంతోషించిన మనస్సుతో యుద్ధమునకై వచ్చెను. సర్వప్రయత్నములచేత అతనిని చంపుటకు నిశ్చయించుకొనెను. (28-30)

 

అప్పుడు సంతోషించిన సూర్యుడు రోమాంచము కలిగిన శరీరముతో దేవగణము మధ్య నిలిచి, రాముణ్ణి చూచి, రావణుడు మరణించనున్నాడని తెలిసికొని (లేదా రావణుడు మరణించు నట్లు  అనుగ్రహించి) “తొందరపడుము” అని పలికెను. (31)

 

శ్రీమద్రామాయణమందలి యుద్ధకాండలోని నూట ఐదవ సర్గము సమాప్తము.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s