నల్లమిరియం చెట్టు


నల్లమిరియం చెట్టు

డా వి. చంద్రశేఖరరావు

చంద్రశేఖరరావు గారి రచనల గురించి అక్కడ అక్కడా చూసినా ఎప్పుడూ ఎందుకో చదవాలనిపించలేదు. బహూశా ఆయన రచనలు కొంచం గంభీరంగా, మార్మికంగా అనిపించడం వల్లనేమో. ఆయన అకాల మరణం తరువాత ఆయనతో జ్ఞాపకాలని పంచుకుంటూ, ఆయన రచనా సంపదను తలచుకుంటూ వచ్చిన వ్యాసాలను చూసాక తప్పక ఆయన రచనలను చదవాలన్న ఆసక్తి కలిగింది. మొదటగా చదివింది యీ నల్లమిరియం చెట్టు నవల.

ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టి మాదిగ దండోరా ఉద్యమ నేపధ్యంలో ఎమ్మెల్యే అవటానికి ప్రయత్నిస్తున్న రాజసుందరం అతని కుటుంబం చుట్టూ తిరుగుతుంది కథ. ఈ నవలలో చెప్పిన విషయాల కంటే చెప్పకుండా వదిలేసిన విషయాలు ఎన్నో. అసలు దండోరా ఉద్యమం ఏమిటో, ఎందుకో కూడా ఎక్కడా చెప్పలేదు. రాజసుందరం తమ్ముడు కరుణ కమ్యూనిస్టు, నక్సలైట్, సాధారణ జన జీవితం, మాదిగ దండోరా ఉద్యమ నాయకుడు అవటం ఎలా జరిగింది అనేది చూచాయగా మాత్రమే చెప్పిన రచయిత రాజసుందరం కుటుంబాన్ని పెట్టే బాధలు, చేసే మోసాలు, ఉద్యమం చుట్టూ నడిచే రాజకీయం మాత్రం వివరంగా చెప్పారు. ఈ నవలలో నాకు ఆసక్తిగా అనిపించింది మాత్రం ఆ కుటుంబంలో ఆడవాళ్ళు, వాళ్ళ పరిస్ధితులు, ఆ పరిస్ధితులకు వాళ్ళు స్పందించిన తీరు. ఈ పుస్తకానికి ‘ఒక గాథ గురించి’ అని చక్కటి ముందుమాట రాసిన కె. శివారెడ్డి గారు తాను నల్లమిరియం చెట్టు మూడు సార్లు చదివానని చెప్పారు. నేనయితే యింకోసారి ఈ పుస్తకం చదవలేను. అంత బాధ వుంది ఈ పుస్తకంలో. మొదలు పెడితే ఆపకుండా చదివిస్తుందని మాత్రం చెప్పగలను. పుస్తకం రచయిత సొంత ప్రచురణ అనుకుంటా, ప్రచురణకర్త వివరాలు లేవు. చరిత ఇంప్రెషన్సు వారు అందంగా అచ్చు వేశారు. అక్బర్ గారి బొమ్మలు అర్ధం కాలేదు కానీ అందంగా వున్నాయి.

నెమలికన్ను బ్లాగులో ఈ పుస్తకం గురించి యిక్కడ. రచయిత గురించి యిక్కడ.

ఈ పుస్తకం పైన చర్చ వివినమూర్తి గారి బ్లాగులో యిక్కడ.

రచయిత గురించి ఖదీర్ బాబు గారు యిక్కడ.

రచయిత గురించి ఈమాటలో మధురాంతకం నరేంద్ర గారు యిక్కడ.

రచయిత గురించి కాట్రగడ్డ దయానంద్ గారు సాక్షిలో యిక్కడ.

రచయిత పుస్తకాల గురించి వేదికలో యిక్కడ.

Leave a comment