జుమ్మా


దాదాహయాత్ గారు వ్రాసిన ముందు మాటకి “నవాబు సాబుల గరీబు కధలు” అని శీర్షిక పెట్టారు. నాకు మాత్రం ఈ కధలు కొద్దిగా నవాబు సాబులవీ ఎక్కువగా గరీబులవీ అనిపించాయి. ఈ మధ్య కాలంలో ఇంత చక్కటి ముందు మాట చదవలేదు. దాదాహయాత్ గారి గురించి తెలుసుకోవాలి, వారి రచనలు చదవాలి అన్న ఆసక్తి కలిగింది.

ఈ కధలలో నాకు బాగా నచ్చినది “ఆకుపచ్చ ముగ్గు”. “ముగ్గు ఇంటి ముందు వేస్తే తప్పు కానీ చేతిలో వేస్తే కాదు కదా…! ఒక మతానికీ, మరో మతానికీ తేడా ఇంతేనా?” ఎంత చక్కని ఆలోచన! “తెలుగోళ్ళ దేవుడు” చదువుతున్నప్పుడు ఇలాంటి పాఠశాలలు కూడా ఉంటాయా అనిపించింది. స్నేహితుడికి నచ్చచెప్పటానికి మందిని వెంట తీసుకుని వెళ్ళటం మంచి ఆలోచనా?

ఎంత మంచి కధలైనా కష్టాల కధలు ఒక దాని తరువాత ఒకటి చదవడం కష్టమే. రచయిత వేంపల్లె షరీఫ్ “చాపరాయి” లాంటి ఆహ్లాదకరమైన కధలు మరిన్ని వ్రాయాలని విన్నపం.

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

Advertisements

ఈ మధ్య చదివిన పుస్తకాలు 12/07/2011


పల్లీయులు మరో ఐదు శరత్ బాబు నవలలు
అనువాదం చక్రపాణి
ఈర్ష, ద్వేషం, అసూయ ఈ నవలలకి మూలం. మామూలుగా ఇటువంటివి నాకు నచ్చవు. కానీ రచయిత గొప్పదనమో, అనువాదకుడి నేర్పరితనమో ఆపకుండా చదివేసాను ఈ పుస్తకం. పరిణీత నవల కన్నా సినిమా అద్భుతంగా వుంది. మొదటి సారి పుస్తకం కన్నా సినిమా బాగుండటం. పల్లీయులు చదువుతుంటే అన్నా కరెనీనా గుర్తుకు వచ్చింది.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ. రచయిత గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

భట్టిప్రోలు కథలు – డాక్టర్ నక్కా విజయ రామరాజు
ఇది తెలుగులో ఎలా చెప్పాలో తెలియక ఇలా – “These stories have their heart in the right place but the soul is missing”. ప్రతి కథకి ఒక చక్కని బొమ్మ కథలకి, పుస్తకానికి వన్నె తెచ్చాయి. అసలు కథకి బొమ్మ తప్పనిసరి అని నియమం వుంటే బాగుండును.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

ఆ కుటుంబంతో ఒక రోజు – జే. యు. బి. వి. ప్రసాద్
చాలా రోజుల తరువాత ఒక మంచి పుస్తకం చదివాను. “పులిని చూసి” కథ ఇంతకు ముందే చదివి ఆస్వాదించాను. నాస్తికత్వం నాకు సరిపడక పోయినా, ఆచారం అంటూ చేసే కొన్ని పనులకి అర్థం లేదు అని చెప్పిన “మైల” కథ ఆలోచించేలా చేసింది. తప్పక కొని చదవండి.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

శ్యాంయానా – మెడికో శ్యాం కథలు
ఈ కథలు మొదట్లో చాలా కొత్తగా, ఒక కొత్త ఒరవడిలో చెప్పారే, భలే గమ్మత్తుగా వున్నాయే అనిపించింది. కానీ పోను పోను అదే విషయాన్ని తిప్పి తిప్పి చెపుతున్నట్టు అనిపించింది. ఒక సారి భేషుగ్గా చదవచ్చు.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ.

వేలుపిళ్ళై – సి.రామచంద్రరావు
పదుగురు ఆహా ఓహో అన్న ఈ కథలు బహుశా ఆ కారణంగానేనేమో అంతగా నచ్చలేదు. మరీ ఎక్కువ ఆశించినట్టున్నాను. “కంపెనీ లీజ్” మొదటి సారి చదివినప్పుడు మింగుడు పడ లేదు, ఇప్పుడు రెండో సారి కూడా. భర్తకి వేరే స్త్రీతో సంబంధం వుంది అని తెలిసీ రాజీ పడిన భార్య, ఆ స్త్రీ కష్టంలో వుందని తెలిసీ భర్త పట్టించుకోని కారణానికి భర్తని వదిలెయ్యటం ఏమిటో నాకు అర్థం కాలేదు. “ఫ్యాన్సీడ్రెస్ పార్టీ” కథ, పేర్లు గుర్తు లేవు కానీ, ఒకటి రెండు సినిమాలలో అన్నా కథ చివర వచ్చే మలుపు చూసి వుండటంతో అంత ఆసక్తిగా అనిపించలేదు. ఇక ఆఖరి కథ “క్లబ్ నైట్” నాకు ఎందుకో కొంచెం నార్సిసిస్టిక్ గా అనిపించింది; ఎందుకు వ్రాయటం లేదు అని అడిగే వాళ్ళకి సమాధానం అనిపించింది.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

అమ్మకడుపు చల్లగా – గొల్లపూడి మారుతిరావు
ఇది రచయిత ఆత్మ కథ. తెలుగులో ఇంత చక్కగా, అందంగా, శ్రద్ధగా, ముచ్చటగా తీర్చి దిద్ది అచ్చు వేసే పుస్తకాలు నాకు తెలిసి చాలా అరుదు. మీరు చదివినా చదవకపోయినా ధర పెట్టగలిగితే ఈ పుస్తకం కొని దాచుకోండి. చాలా పెద్ద పుస్తకం, చదవటానికి చాలా రోజులు పట్టింది. ఒక వైవిధ్యమయిన జీవన ప్రయాణం కదా మరి. ఎన్నో విజయాలు ఒక తీరని లోటు ఈ పుస్తకం. నన్ను నిరాశ పరిచిన ఒకే ఒక విషయం “అమరావతి కథలు” గురించి కానీ సత్యం శంకరమంచి గారి గురించి కానీ పెద్దగా వివరాలు లేక పోవటం. నచ్చిన విషయం పరనింద పెద్దగా లేకపోవటం.
ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

గురవాయణం


కొత్త పుస్తకాలు ఏమి తెప్పించుకోవాలా అని ఒక చిట్టా తయారు చేస్తుంటే ఈ పుస్తకం కనపడింది. పుస్తకం గురించి చదువుతుంటే “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” కార్యక్రమంలో గురవారెడ్డి గారితో ఇంటర్వ్యూ చెయ్యటం జరిగింది అని తెలిసి అది చూసాను. మంచి భోళా మనిషి అనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం మాకు దగ్గరలో జరుగుతున్న సంబరాలకి బాపు గారు వస్తున్నారు అని తెలిసి బుడుగు, కోతి కొమ్మచ్చి పుస్తకాలు తీసుకుని బయలుదేరాము. అక్కడికి వెళ్ళి సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్న సభలోకి వెళ్ళి చూద్దును కదా ఇసక వేస్తే రాలనంత జనం. సుద్దాల అశోక్ తేజ గారు పద్యాలు పాడుతుంటే జనం చప్పట్లు కొడుతున్నారు. సరే కష్టం మీద కూర్చోవటానికి రెండు కుర్చీలు సంపాదించి బాపూ గారి కోసం ఎంత వెతికినా వారు కనపడరే. ఇలా లాభం లేదని బాడ్జీలు పెట్టుకుని హడావిడిగా తిరుగుతున్న వాళ్ళని కనీసం ఒక నలుగురుని అడిగాను బాపు గారు ఎక్కడ వున్నారు అని. తెలియదు అని సమాధనం. బాపు గారు తెలియదా, ఎక్కడ వున్నారో తెలియదా అని అడిగే ధైర్యం నాకు లేక పొయింది. ఇంతలోకి ఒక పెద్దావిడ మైక్ తీసుకుని ఒక ప్రముఖ సినీ నటుదు అక్కడికి వస్తున్నాడని అందుకే ఈ జనం అని చెప్పి తెలుగు భాష మీద అభిమానం వుంటే పక్క గదిలోకి రమ్మని విగ్నప్తి చేసారు. ఇక లాభం లేదు అని ఆవిడనే పట్టుకుని అడిగాను బాపు గారు వచ్చారా అని. ఆవిడ రాలేదు అని చెప్పారు. రేపు వస్తారా అని అడిగాను. రాకపోవచ్చు అని, మీరు ఎవరు అని అడిగారు. నేను ఆటోగ్రాఫ్ అని అన్నానో లేదో ఆవిడ మొహం తిప్పేసుకుని ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

ఈ సందడిలో చూద్దును కదా గురవారెడ్డి గారు చక్కగా పంచె కట్టుకుని చేతిలో పుస్తకాలతో ఎదురు వస్తున్నారు. నేను ఆయన దగ్గరకి వెళ్ళే లోపల ఎవరో ఆయన చేతిలో పుస్తకం తీసుకోవటం, ఆయన అది ఉచితం కాదు అమ్మితే వచ్చిన సొమ్ము దానం చేస్తున్నట్టు చెప్పటం జరిగింది. నేను ఒక ప్రతి కొని వారిని సంతకం చెయ్యమని అడిగితే నా పేరు అడిగి మరీ సంతకం చేసి ఇచ్చారు.

ఈ పుస్తకం అప్పుడే రెండవ ముద్రణ పొందటం ఆశ్చర్యం కలిగించింది. కొంత అమెరికా పర్యటన కబుర్లు, కొంత పాత జ్ఞాపకాలు, నాలుగు మంచి మాటలు కలిపితే ఈ పుస్తకం. ఈ కబుర్లు అన్నీ సరదాగ సాగటం ఈ పుస్తకం ప్రత్యేకత. బోలెడన్ని చిత్రాలతో, కార్టూన్లతో అందంగా, ముచ్చటగా అచ్చు వేసారు ఈ పుస్తకాన్ని. అందుకైనా కొని దాచుకోవచ్చు ఈ పుస్తకాన్ని.

మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ.

ఈ పుస్తకంలో కార్టూన్లు వేసిన రాజు గారి గురించి ఎవరికన్నా తెలుసా? వారి బొమ్మలు వున్న పుస్తకాలు ఇంకేమన్నా మీకు తెలిసి వుంటే దయ చేసి క్రింద ఒక వ్యాఖ్య రాయండి.

ఇప్పుడో చిన్న పిడకల వేట. సాహిత్య చర్చ కోసం ఆ పక్క గదిలోకి ఎంత మంది వచ్చారో కనుక్కోండి చూద్దాం :0

కథ 2006


మ్రణ్మయ నాదం – ఓల్గా

స్త్రీవాద దృక్కోణంలో రామాయణం? నచ్చలేదు.

మాయిముంత – పెద్దింటి అశోక్ కుమార్

నా చిన్నతనం కళ్ళ ముందు కదలాడింది. గొడ్ల సావిట్లో గేదెలు ఈనటం, జున్ను పాలు, దూడతో కబుర్లు చెబుతుంటే పాలేళ్ళు నవ్వుకోవటం, గేదెలను స్నానానికి చెరువు గట్టుకి తోలుకెళ్ళటం, కుడితి కలపటం, పాలు పితకటం, గడ్డి నెమరు వేస్తుంటే అలా చూస్తూ కూర్చోవటం …

ఆత్మలు వాలిన చెట్టు – పి.సత్యవతి

ఆత్మహత్యలు. బహుశా 2006 లో ఈ కారణాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని తెలియటానికి ఈ కథను ఈ సంకలనంలో చేర్చారేమో!

జాతక కథ – బి.అజయ్ ప్రసాద్

బౌధ్ధం. ‘అరణ్యం ఆవిష్కరించిన సత్య్యాల కంటే మనుషులు జీవిస్తున్న సమాజం భీభత్సంగా కనిపించింది’. ఆలోచింప చేసే కథ.

మా నాన్న, నేను, మా అబ్బాయి – కల్లూరి భాస్కరం

మూడు తరాల సమావలోకనం. మంచి కథ.

ఊడల్లేని మర్రి – స.వెం.రమేష్

కథ కంటే కథ చెప్పిన తీరు చాలా నచ్చింది.
నేనెక్కాల్సిన రైలు వస్తుండాది. పది రూపాయల కాగితాలు పది తీసి చెల్లవ్వ చేతిలో పెట్టినాను. ఒక్కటి తీసుకుని తొమ్మిది తిరిగిస్తా, “ఈటిని ఏ పెట్లో పెట్టి బీగం యేసేది కొడకా?” అనింది.

గేటెడ్ కమ్మ్యూనిటీ – అక్కిరాజు భట్టిప్రోలు

నాకు చాలా నచ్చిన కథ. నేటి వాస్తవ చిత్రం. నేటి జీవన పోరాటం.
మీ కజిన్ ఇంకా శ్రీనగర్ కాలనీలో ఇస్త్రీ బండి పెట్టుకున్నాడని మీరే చెప్పారు…అతని ద్రుష్టిలో మీరూ ఓ మాదిరి గేటెడ్ కమ్మ్యూనిటీనే. రేప్పొద్దున్న మీ పిల్లల్లిదరూ చదువుకుని మా పక్కన చేరొచ్చు..అప్పుడు మీకేమీ తప్పనిపించదు కదా.

అతను, అతనిలాంటి మరొకడు – డాక్టర్ వి. చంద్రశేఖరరావు

విప్లవ కథ? కొంచెం గందరగోళంగా అనిపించింది.

యూ…టర్న్ – దగ్గుమాటి పద్మాకర్

బాగా డబ్బు వున్న ఒక వ్యాపారి చిన్న పిల్ల చేసిన ఒక పని వల్ల తన డబ్బుని ఏదన్నా మంచి పనికి వాడదాం అనే ఆలోచన చేస్తాడు. ఈ కథ నచ్చలేదు.

వేట – వి.ఆర్.రాసాని

లోతైన కథ. అంత తేలికగా మర్చిపోలేము. చాలా పదాలకి అర్థం తెలియ లేదు.
ఎదురుగా…కూలిపోయిన తన గుడిసె గోడల పెళ్ళల కుప్ప కనిపించింది, అదే సమయంలో…కొంతసేపటి క్రితం తాను ఇసుళ్ళు పట్టేసి, తవ్వేసి వచ్చిన పుట్ట శిధిలాలు గుర్తుకు వచ్చి, వెక్కిరిస్తున్నట్లనిపించింది.

జీవచ్ఛవాలు – పి. చిన్నయ్య

అద్భుతమైన కథ. ఫ్లోరోసిస్ ప్రభావం ఇంత దారుణంగా ఉంటుందని ఇది చదివే వరకు నాకు తెలియదు. రచయితకు ధన్యవాదములు.

అతడు..నేను..లోయ చివరి రహస్యం – భగవంతం

అర్థం కాలేదు. ఎవరన్నా చదివితే కొంచెం గుట్టు చెపుతారా?

యవనిక – గొరుసు జగదీశ్వరరెడ్డి

రొటీను కథ. ఈ సంకలనంలో ఎందుకు చేర్చారో?

ఈ పుస్తకం నేను కినిగె లో కొన్నాను. కినిగె గురించి మరిన్ని వివరాలు ఇక్కడ.

సీరియస్ మెన్


మను జోసెఫ్ రచించిన నవల ‘సీరియస్ మెన్’ కు ద హిందూ బెస్ట్ ఫిక్షన్ అవార్డ్ 2010 లభించింది. న్యాయ నిర్ణేతలు అందరికీ నచ్చి ఏకగ్రీవంగా ఈ అవార్డ్ ఇవ్వటం జరిగింది అని చదివి ఉత్సాహంగా పుస్తకం కొని చదివాను. నేను ఆశించినంత గొప్పగా లేదు కానీ బానే వుంది.

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ.

అసలేం జరిగిందంటే…


నా తొలి ఉద్యోగంలో ఒక విధంగా పి.వి.ఆర్.కే.ప్రసాద్ గారి క్రిందే పని చేయటం జరిగింది. అయినా ఆయన పేరు వినటమే కానీ వారిని కలవటం కానీ చూడటం కానీ జరగలేదు. అక్కడ చేస్తున్నప్పుడే ‘ఐఏఎస్’ అధికారులని, వారి(ప్రభుత్వ) పని తీరుని దగ్గరి నుండి గమనించే అవకాశం లభించింది. నిస్సందేహంగా అందరూ మేధావులే. నేను చూసినంతలో ఎక్కువ మంది రాజకీయ క్రీడ(పదవుల పైరవీలు, పై వారి మెప్పు కోసం ప్రాకులాడటం, చంచాగిరి) లో మునిగి తేలుతూ ఉండే వారు. కొద్ది మంది నిజంగా ప్రజలకు ఏదో చెయ్యాలని తహ తహ లాడుతూ రాత్రి పగలు కష్ట పడే వారు. ఆ కోవకి చెందిన శ్రీ పి.వి.ఆర్.కే.ప్రసాద్ గారు ఒక ‘ఐఏఎస్’ అధికారిగా తన ౩౫ సంవత్సారాల అనుభవాలను ఈ పుస్తకం ద్వారా మనతో పంచుకున్నారు. ఎందరో రాష్ట్ర ముఖ్యమంత్రులతో పని చేసిన అనుభవాలు ఒక ఎత్తు అయితే మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి తో పని చేసిన అనుభవాలు ఒక ఎత్తు. పి.వి. గారి హయాంలో జరిగిన అనేక ఆసక్తికర సంఘటనలు, వారు తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాలు ఎలా ఏ నేపధ్యం లో తీసుకో వలసి వచ్చిందో, వారి చివరి రోజులు ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. తప్పక చదవవలిసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని అందంగా తీర్చి దిద్దిన ఎమెస్కో వారికి అభినందనలు.

ఈ పుస్తకం గురించి మరిన్ని వివరాలు యిక్కడ మరియు యిక్కడ.

పీకాక్ క్లాసిక్స్


Connecting to the classics నుండి –

“The public library system in Andhra Pradesh is no more what it used to be yet there are still 1500 functional libraries spread over the state. So we are inviting people who feel passionately about Telugu and good books in Telugu to pick any work choose any title of their choice from a list of 40 books. The books will be reprinted (with the donor’s name) and the copies donated directly to the public libraries,” reveals Gandhi.

ఎంత వెతికినా పీకాక్ క్లాస్సిక్స్ వారిని ఎలా సంప్రదించాలో వివరాలు దొరకలేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే ఇక్కడ తెలియచేయ మనవి.
‘పీకాక్ క్లాసిక్స్’
Keeping reading alive
అర చేతిలో విజ్ఞాన సర్వస్వం
ఐక్యతకు హిందీ తోడ్పుడుతుందా ?